ప్రాణపాయంలో ప్రియురాలు, ప్రియుడిపైనే తల్లిదండ్రుల అనుమానం


హైదరాబాద్: ప్రేమికుడితో సరదాగా గడిపేందుకు బయటకు వెళ్లిన ఓ యువతి రోడ్డు ప్రమాదంతో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది.తీవ్రంగా గాయపడిన ఆ యువతి బ్రెయిన్ డెడ్‌కు గురైంది. అయితే తమ కూతురు బ్రెయిన్ డెడ్ కు కారణమైన ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని ఎస్సార్ నగర్ పోలీసులకు బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.

 వరంగల్‌ జిల్లా బచ్చన్నపేట మండలంలోని గీతానగర్‌కు చెందిన పి.భవాని ఎస్సార్‌నగర్‌లోని ఎన్‌.ఎస్‌.ఆర్‌ మహిళల హాస్టల్‌లో ఉంటూ పంజాగుట్టలోని గోదావరి కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థలో పనిచేస్తోంది. ఈ సంస్థ యజమాని మల్లేష్‌రెడ్డి మేనల్లుడైన శ్రీనాథ్‌తో రెండేళ్ల కిందట ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది.

దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. మంగళవారం ఇద్దరూ మూసాపేటలోని ఓ హోటల్‌కు వెళ్లారు. బుధవారం ఉదయం 6.30 ప్రాంతంలో బైకుపై వస్తుండగా ఎర్రగడ్డలోని సెయింట్‌ థెరెసా ఆసుపత్రి వద్ద ఒక్కసారిగా ఆగిపోయిన కారును వెనుక నుంచి ఢీకొన్నారు. తలకు శిరస్త్రాణం ఉన్న శ్రీనాథ్‌ స్వల్పగాయాలతో బయటపడగా భవానీ తలకు తీవ్ర గాయాలయ్యాయి.

 చికిత్సకోసం బాధితురాలిని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు ప్రకటించారు.దీంతో తమ కూతురు బ్రెయిన్ డెడ్ కు కారణమైన శ్రీనాథ్‌పై చర్యలు తీసుకోవాలని భవానీ తల్లి తండ్రులు బుధవారం నాడు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మంగళవారం నాడు తమ కూతురు తమకు ఫోన్ చేసి శ్రీనాథ్ తన మీద అనుమానంతో ఉనన్నారని అతడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని భవానీ తమకు చెప్పిందని తల్లిదదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.మరోవైపు భవానీ అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు