వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తన చిన్నాన్న  వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై షాకింగ్ కామెంట్స్ చేశారు. విచారణను ఎవ్వరూ అడ్డుకోవడానికి వీల్లేదన్నారు. 

అమరావతి : వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. బిజీ బిజీగా గడుపుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కెసిఆర్ ప్రభుత్వ అవినీతిపై కాగ్ కు షర్మిల ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.. వైఎస్ వివేకా హత్యపై స్పందించారు. తన కుటుంబం లో జరిగిన ఘోరం ఇది అని ఆవేదన వ్యక్తం చేశారు సునీతకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. తన చిన్నాన్నను అంత ఘోరంగా ఎవరు హత్య చేశారో.. వాళ్ళకి శిక్ష పడాలి అని అన్నారు. దర్యాప్తును ఎవరు అడ్డుకోవడానికి వీలు లేదని షర్మిల పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా, దివంగత మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని వేరే రాష్ట్రంలో విచారించాలన్న పిటిషన్పై బుధవారం సుమారు రెండు గంటలపాటు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించింది. వేరే రాష్ట్రంలో విచారణ విషయమై అక్టోబర్ 21న సమగ్రంగా తీర్పును వెల్లడించనున్నట్లు కోర్టు తెలిపింది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును వేరే రాష్ట్రంలో విచారించేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈ ఏడాది ఆగస్టు 12న వైఎస్ సునీతా రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విచారణను సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరగాలని ఆమె కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో విచారణ నిర్వహించాలని ఆమె ఆ పిటిషన్లో కోరింది. 

తెలంగాణ ఉద్యమకారులకు కేసీఆర్ ఫోన్లు:బీజేపీకి దాసోజు గుడ్ బై, అదే బాటలో మరికొందరు నేతలు

ఈ పిటిషన్ పై విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు గతంలోనే సీబీఐ, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 19న సునీతారెడ్డి పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. వేరే రాష్ట్రంలో కేసు విచారణకు ఉన్నత న్యాయస్థానం ఏ రాష్ట్రంలో విచారణ కోరుకుంటున్నారని ఈ కేసులో నిందితులుగా ఉన్న ఉమా శంకర్ రెడ్డి, గంగిరెడ్డిలను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసు విచారణకు సునీత రెడ్డి తరఫు న్యాయవాది అంగీకరించారు. కానీ సీబీఐ తరఫు న్యాయవాది మాత్రం తెలంగాణలో ఈ కేసు విచారణకు అంగీకరించలేదు.

కర్ణాటక రాష్ట్రంలో విచారణకు సానుకూలంగా స్పందించారు. ఏ రాష్ట్రంలో విచారణ నిర్వహించాలనే విషయమై రెండు, మూడు రోజుల్లో ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ కేసు విచారణకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని కూడా పిటిషనర్ సునీత రెడ్డి ఆరోపించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య విచారణ ఎప్పుడు పూర్తి చేస్తారని సిబిఐ చెప్పకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్న ఇద్దరు మరణించిన విషయాన్ని పిటిషనర్ సుప్రీంకోర్టుకు చెప్పారు.