శ్రీకాకుళం: తనను యువకుడు మోసం చేయడంతో కుల పెద్దలను ఆశ్రయించిన యువతిపై కుల పెద్దలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె శ్రీకాకుళం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. 

జిల్లాలోని సంతబొమ్మాళి మండలంలోని సున్నాపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణరావు అనే యువకుడు  అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. అయితే అతని ప్రేమకు ఆ యువతి ఒకే చెప్పింది.  అయితే కొంత కాలం వీరిద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ పెళ్లికి మాత్రం లక్ష్మణరావు ఒప్పుకోలేదు.

ప్రేమించానని చెప్పి తనను మోసం చేశాడని యువతి గ్రామానికి చెందిన కుల పెద్దలను ఆశ్రయించింది. దీంతో కుల పెద్దలు యువతికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయమై పంచాయితీ నిర్వహించారు. యువతిని మోసం చేసినందుకు గాను  రూ. 25 లక్షలు ఇవ్వాలని  కోరారు. అయితే రూ. 18 లక్షలు మాత్రమే ఇచ్చేందుకు లక్ష్మణ్ కుటుంబ సభ్యులు ఒప్పుకొన్నారు.

also read:ప్రకాశం జిల్లాలో మైనర్ బాలికపై ఆరు నెలలుగా వ్యక్తి అత్యాచారం

ఈ పంచాయితీ విషయంలోనే లక్ష్మణరావుపై కుల పెద్దలు దాడి చేశారు. దీంతో లక్ష్మణరావు కుటుంబసభ్యులు కుల పెద్దలపై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఈ కేసు నుండి బయట పడేందుకు గాను మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని యువతి కుటుంబసభ్యులతో లక్ష్మణరావుపై కేసు పెట్టించారు. దీంతో లక్ష్మణరావును పోలీసులు అరెస్ట్ చేశారు.

లక్ష్మణరావును పోలీసులు అరెస్ట్ చేయడంతో తమ డబ్బులు తమకు ఇవ్వాలని ఆ కుటుంబం కుల పెద్దలపై ఒత్తిడి చేసింది. అయితే యువతి పేరున బ్యాంకులో డిపాజిట్ చేసినట్టుగా చెప్పారు. లక్ష్మణరావు కుటుంబం నుండి రూ. 18 లక్షలు వసూలు చేసి తమ కుటుంబానికి రూ. 8 లక్షలు ఇచ్చారని మిగిలిన రూ. 10 లక్షలు కుట పెద్దల వద్దే ఉంచుకొన్నారని బాధిత యువతి ఆరోపిస్తోంది.

ఈ డబ్బుల గురించి అడిగితే తనను లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని ఆమె చెప్పారు. తమ కోరిక తీర్చితే రోజూ రూ. 2 వేల చొప్పున ఇస్తామని చెప్పారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వేధింపులు తీవ్రం కావడంతో ఎస్సీకి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.