చంద్రబాబు అరెస్ట్.. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల హౌస్ అరెస్ట్‌లు.. ఇళ్ల వద్ద భారీగా పోలీసుల మోహరింపు
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. టీడీపీ నేతల ఇళ్ల దగ్గర పికెట్‌లు ఏర్పాటు చేసి.. భారీగా పోలీసులను మోహరిస్తున్నారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లరావు, నరసరావుపేటలో చదలవాడ అరవిందబాబును, నెల్లూరులో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని, కోనసీమ మండపేటలో ఎమ్మెల్యే జోగేశ్వరరావును, ప్రకాశం జిల్లాలో నూనసాని బాలాజీని, పల్నాడు జిల్లా ముప్పాళ్లలో జీవీ ఆంజేయులును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇతర నేతలను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు.
కుప్పంలో కూడా టీడీపీ ముఖ్య నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కొందరు టీడీపీ నాయకులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇక, చంద్రబాబు కొడుకు నారా లోకేష్‌ను కోనసీమ జిల్లాలో యువగళం పాదయాత్ర క్యాంప్ వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో లోకేష్ వాగ్వాదానికి దిగారు. అనంతరం తాను బస చేస్తున్న బస్సు వద్దే నేలపై కూర్చొన్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగుతుంది. ఇక, చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును టీడీపీ నేత వెనిగండ్ల రాము ఖండించారు. గుడివాడలోని తన నివాసంలో శాంతియుతంగా నిరాహార దీక్షకు దిగారు.
తిరుపతిలోని అన్నపూర్ణ సరుకులు సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇక, చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో శనివారం వివిధ ప్రాంతాలకు బస్సు సర్వీసులను రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో రోడ్లపై నిరసనలు, బస్సులపై దాడులు జరుగుతాయని భావించిన అధికారులు బస్సు సర్వీసులను ముందు జాగ్రత్తగా రద్దు చేశారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడును సీఐడీ అధికారులు శనివారం తెల్లవారుజామున నంద్యాలలో అరెస్ట్ చేశారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. ఇక, ఇదే కేసులో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును కూడా ఏపీ పోలీసులు విశాఖపట్నంలో అరెస్ట్ చేశారు.