రాజమహేంద్రవరం: తెలుగుదేశం పార్టీలో రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గం టికెట్ లొల్లి మెుదలైంది. టీడీపీ నుంచి టికెట్ ఆశించే వారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా రాజమహేంద్రవరం అర్బన్ సీటును బీజేపీకి కేటాయించింది టీడీపీ. 

దీంతో ఆకుల సత్యనారాయణ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. అయితే బీజేపీతో పొత్తు తెగిపోవడం, ఆకుల సత్యనారాయణ జనసేనకు చేరిపోవడంతో టీడీపీ నేతలు రాజమహేంద్రవరం అర్బన్ సీటుపై కన్నేశారు. సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి టికెట్ నాదే అంటున్నారు.  

అటు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆదిరెడ్డి అప్పారావు సైతం టిక్కెట్ తనకే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరూ సరిపోరన్నట్లు మధ్యలో గుడా చైర్మన్, టీడీపీ సీనియర్ నేత గన్ని కృష్ణ సైతం బరిలో ఉన్నారు. 

తాజాగా రాజమహేంద్రవరం నగర మేయర్ పంతం రజనీ శేషసాయి సైతం రాజమహేంద్రవరం అర్బన్ టికెట్ నుంచి పోటీ చెయ్యాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే నగర మేయర్ గా పనితీరు మెురుగుపరచుకోవడంతోపాటు చాపకింద నీరులా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 

తాజాగా ఆర్యాపురం కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు సైతం తాను కూడా రేసులో ఉన్నానని ప్రకటించారు. ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడుని కలిసిన ఆయన తనకు టిక్కెట్‌ ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలిపారు. చల్లా శంకరరావు తండ్రి చల్లా అప్పారావు రాజమహేంద్రవరం మునిసిపల్‌ చైర్మన్‌గా పని చేశారు. 

ఇకపోతే శంకరరావుకు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ గా మంచి పేరుంది. 2009లో మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరుపున అర్బన్ ఎమ్మెల్యేగా శంకరరావు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాశరావు చేతిలో కేవలం 1230 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 

అనంతరం టీడీపీలో చేరిన ఆయన ప్రస్తుతం ఆర్యాపురం కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే రాజమహేంద్రవరం వెలమ కమ్యూనిటీ గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.  
 
ఇకపోతే రాజమహేంద్రవరం అర్బన్ టికెట్ పై ఎన్నాళ్లనుండో వేచి చూస్తున్నారు గుడా చైర్మన్ గన్ని కృష్ణ. కానీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ టిక్కెట్ ను తన్నుకు పోతున్నారు. అయితే 2014 ఎన్నికల్లో అయినా తనకు వస్తుందని ఆశపడ్డారు. కానీ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. 

దీంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న ఆయనకు గుడా చైర్మన్ పదవి ఇచ్చి చంద్రబాబు సంతృప్తి పరిచారు. ఈసారి టికెట్ తనదేనని ధీమాగా ఉన్నారు. అయితే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాత్రం తాను వచ్చే ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ నుంచి కాకుండా అర్బన్ నుంచి పోటీ చేస్తానని సన్నిహితుల వద్ద చెప్పారట. 

దీంతో ఆయనపై గుర్రుగా ఉన్నారు గన్నికృష్ణ. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఆదిరెడ్డి అప్పారావు సైతం టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి తనకు పోటీ వస్తున్నారని తెలుసుకున్న ఆయన పలుమార్లు బహిరంగంగా విమర్శలకు దిగుతున్నారు. 

అటు నగర మేయర్ పంతం రజనీ శేషసాయి సైతం టిక్కెట్ రేసులో ఉన్నారు. రాజమహేంద్రవరం మేయర్ ప్రజల మన్నలను పొందిన ఆమె ఈసారి అసెంబ్లీకి పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. అటు తన భర్త ప్రముఖ ఎంఎస్ఓ పంతం కొండలరావు కూడా రాజమహేంద్రవరం ప్రజలకు చాలా సుపరితులు. 

తన తండ్రి పేరుమీద చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ చేరువయ్యారు. నియోజకవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా వీరికి చల్లా శంకరరావు తోడయ్యారు. దీంతో రాజమహేంద్రవరం అర్బన్ సీటుపై పోటీ పెరుగుతుండటంతో టికెట్ ఎవరు దక్కించుకుంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.