స్కూల్ కు వెళ్లే మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని గర్భవతిని చేసాడో యువకుడు. ఈ ఘటన ఉమ్మడి గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. 

గుంటూరు : అభం శుభం తెలియని పద్నాలుగేళ్ళ బాలికను మాయమాటలతో లోబర్చుకున్నాడో యువకుడు. పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతో బాలిక గర్భం దాల్చింది. కడుపునొప్పితో బాధపడుతున్న బాలికకు స్కూల్ టీచర్లు వైద్యపరీక్షలు చేయించగా ఆరు నెలల గర్భంతో వున్నట్లు బయటపడింది. దీంతో బాలికను తల్లి నిలదీయడంతో యువకుడి అత్యాచారం వ్యవహారం బయటపడింది.

పోలీసుల తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రాంతానికి చెందిన ఓ దళిత కుటుంబం ఉపాధి నిమిత్తం గుంటూరు జిల్లాకు వలస వెళ్లింది. పత్తిపాడు మండలంలోనే ఓ గ్రామంలో కూతురితో కలిసి తల్లిదండ్రులు నివాసముండేవారు. రోజూ కూతురుని స్కూల్ కు పంపించి తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లేవారు. ఈ సమయంలోనే బాలికకు గొట్టిపాడుకు చెందిన రామకృష్ణ(27) పరిచయం అయ్యాడు. బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

బాలిక తండ్రి చనిపోవడంతో ఆ కుటుంబం తిరిగి పల్నాడు జిల్లాలోని స్వగ్రామానికి వెళ్లిపోయారు. అయినప్పటికి రామకృష్ణ తరచూ ఆ గ్రామానికి వెళ్లి బాలికను కలిసేవాడు. ఈ క్రమంలో అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా గత ఏడాదికాలంగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతుండటంతో గర్భం దాల్చింది. 

Read More తిరుపతి జిల్లాలో విషాదం : చెట్టుకు ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య

బాలిక గర్భం దాల్చిన విషయం తల్లి గుర్తించలేకపోయింది. కానీ స్కూల్ కు వెళ్ళిన కడుపునొప్పితో బాధపడతుంటే టీచర్లు హాస్పిటల్ కు తీసుకెళ్ళారు. వైద్య పరీక్షలు చేసి బాలిక గర్భంతో వుందని చెప్పడంతో టీచర్లు షాక్ గురయ్యారు. వెంటనే బాలిక తల్లికి సమాచారం ఇచ్చారు. బాలికను తల్లి నిలదీయగా తనపై గత ఏడాదిగా జరుగుతున్న అఘాయత్యం గురించి బయటపెట్టింది. దీంతో ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా రామకృష్ణపై పోక్సో తో పాటు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.