శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్‌గా జర్నలిస్ట్ స్వప్నను నియమించనున్నారా? అవుననే సమాధానాలే ఎక్కువగా వినపడుతున్నాయి.  ప్రస్తుతం ఆమె ఎస్వీబీసీ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. గత రెండు రోజులుగా ఎస్వీబీసీలో చోటుచేసుకున్న పరిణామాలతో.. ఆ సంస్థ చైర్మన్ పృథ్వీ రాజీనామా చేశారు. 

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశం మేరకు రాజీనామా సమర్పించారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌గా ఉన్న స్వప్న.. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. స్వప్న ఓ తెలుగు న్యూస్ ఛానల్‌లో యాంకర్‌గా పని చేస్తున్నారు.

కాగా...  ఇంతకాలం నటుడు, వైసీపీ నేత పృథ్వీ ఎస్వీబీసీ ఛైర్మన్ గా కొనసాగారు. అయితే... రెండు రోజుల క్రితం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఛానెల్ ఉద్యోగినితో ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మెన్ పృథ్వీరాజ్  అసభ్యంగా మాట్లాడినట్టుగా  సోషల్ మీడియాలో ఆడియో సంభాషణ వైరల్ గా మారింది. ఈ పరిణామాలపై పృథ్వీరాజ్  ఆదివారం నాడు మధ్యాహ్నం ఓ వీడియోను మీడియాకు పంపారు.

చానెల్ ఉద్యోగుల పట్ల తాను ఏ రకంగా వ్యవహరించిందో అందరికీ తెలుసునని చెప్పారు. తాను అందరికి అన్నగానే ఉన్నానని చెప్పారు. తన ఆడియోను మార్ఫింగ్ చేశారని పృథ్వీరాజ్ చెప్పారు.అన్యమత ప్రచారం గురించి కూడ తప్పుడు ప్రచారం చేశారని ఆయన చెప్పారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనల విషయంలో పృథ్వీ చేసిన ఆరోపణలపై కూడ ఆయన వివరణ ఇచ్చారు.

Also Read వాయిస్ మార్ఫింగ్ చేశారు, మళ్లీ వస్తా: పృథ్వీరాజ్...

రాజధాని  రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ తాను అనలేదన్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని పృథ్వీరాజ్ చెప్పారు. తన మాటలకు రైతులు బాధపడినందుకుగాను  తనను క్షమాపణలు చెబుతున్నట్టుగా పృథ్వీ ఆ వీడియోలో వివరించారు.ఉద్యోగినిని అసభ్యంగా మాట్లాడినట్టుగా ఆడియో సంభాషణ తనకు తలవొంపులు తెచ్చేవిధంగా ఉందన్నారు. తాను పద్మావతి గెస్ట్‌హౌస్‌లో మద్యం సేవించినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని పృథ్వీరాజ్ తెలిపారు.

విజిలెన్స్ విచారణలో  అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. పోసాని కృష్ణమురళి మాదిరిగానే తాను కూడ ముక్కుసూటిగా మాట్లాడుతానని చెప్పారు.పార్టీ ప్రతిష్టను దిగజార్చేలా తాను ఏనాడూ వ్యవహరించలేదని తెలిపారు. కాగా... పృథ్వీ రాజీనామాతో స్వప్న పేరు ప్రస్తుతం ఎక్కువగా వినపడుతోంది. మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.