అమరావతి: ప్రముఖ జర్నలిస్టు జీవీడి కృష్ణమోహన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమ్యూనికేషన్స్ విభాగానికి సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా ఆయన పనిచేయనున్నారు. సీనియర్ జర్నలిస్ట్ అయిన కృష్ణమోహన్ తొమ్మిదేళ్లుగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు.

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొంతుకగా నిలిచారు. వివిధ పత్రికలలో పనిచేసిన ఆయన సాక్షి దినపత్రి ఆవిర్భావంలో చేరారు. పత్రికలో ఏది నిజం అనే శీర్షిక ద్వారా వ్యవస్థల్లో వేళ్ళూనుకుపోయిన అవినీతిని చీల్చి చెండాడుతూ వార్తల్లో నిలిచారు. 

దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన తనయుడు ప్రస్తత సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు జీవీడీ కృష్ణమోహన్. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ముందు నుంచే వైయస్ కుటుంబంతో సత్సబంధాలు కలిగిన జీవీడీ కృష్ణమోహన్ 2012లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆ పార్టీకే పరిమితమైపోయారు. వైయస్ జగన్ రాజకీయ ప్రస్థానంలో ఆయనకు ఎదురైన ప్రతి కష్టంలో ప్రతి బాధలో జీవీడీ ఆయనకు తోడుగా నిలబడ్డారంటూ పార్టీలో చెప్పుకుంటూ ఉంటారు. 

 ఇకపోతే సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన పి.వి. రమేశ్‌ను సీఎం స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనతో పాటు మరో ఐఏఎస్ అధికారి జే. మురళిని సీఎం అదనపు కార్యదర్శిగా నియమించారు.