ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అక్రమాస్తుల కేసుల్లో బాగా వినిపించిన పేరు ఐఏఎస్ శ్రీ ల‌క్ష్మి. చిన్న వ‌య‌సులోనే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు ఎంపికై.. జ‌గ‌న్ అక్ర‌మాస్తుల కేసుల్లో ఇరుక్కుని కెరీర్‌ని పణంగా పెట్టారు. దీంతో జైలు జీవితం దక్కగా, రావాల్సిన ప్ర‌మోష‌న్లు ఆగిపోయాయి.

అన్ని సరిగ్గా నడిచుంటే శ్రీలక్ష్మీ పిన్న వయసులోనే చీఫ్  సెక్రటరీగా బాధ్యతలు చేపట్టేవారని ఐఏఎస్ వర్గాల్లో వినిపించే మాట. ఇక కెరీర్ లేదనుకుంటున్న సమయంలో సీఎంగా వైఎస్ జగన్ పదవీ బాధ్యతలు స్వీకరించడంతో ఆమెలో కొత్త ఆశలు చిగురించాయి.

అటు ముఖ్యమంత్రి జ‌గ‌న్ కూడా తెలంగాణలో వున్న ఆమెను ఏపీకి తీసుకురావడానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేశారు. దీనిపై పలుమార్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సైతం చర్చలు జరిపారు.

అందుకు చంద్రశేఖర్ రావు ఓకే చెప్పినా కేంద్రం నుంచి మాత్రం పర్మిషన్ రాలేదు. అయితే ఎట్టకేలకు గత వారం ఏపీకి అలాట్ అయ్యారు శ్రీ ల‌క్ష్మి. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేశారు సరే.. మరి ఏ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమెకు జగన్ ఏ పోస్ట్ ఇస్తారనే చర్చ నడిచింది.

చివరికి మంగళవారం జరిగిన కీలక మార్పుల్లో శ్రీలక్ష్మీకి పురపాలకశాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. పురపాలక శాఖ బాధ్యతలు చూస్తోన్న శ్యామలరావును జలవనరుల శాఖకు మార్చారు. కె.సునీతకు సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.