హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత టి. సుబ్బరామిరెడ్డి బుధవారం నాడు మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిని బుధవారం నాడు ఆయన నివాసంలో కలిశారు. కాంగ్రెస్ పార్టీలో  చేరాలని సుబ్బరామిరెడ్డి... కిరణ్‌కుమార్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన కూడ సానుకూలంగానే స్పందించారని సమాచారం. త్వరలోనే ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కిరణ్‌కుమార్ రెడ్డి  సమావేశం కానున్నారని సమాచారం.

మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేలా  ఆ పార్టీ నాయకత్వం  చర్యలను ప్రారంభించింది. ఈ మేరకు మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు రెండు రోజుల క్రితం  కిరణ్‌కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. పార్టీలోకి రావాలని కిరణ్‌కుమార్ రెడ్డిని ఆహ్వానించారు.

బుధవారం నాడు సుబ్బరామిరెడ్డి కూడ సుమారు 35 నిమిషాల పాటు  కిరణ్‌కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరితే జాతీయ స్థాయిలో  పార్టీలో సముచిత స్థానం కల్పించే అవకాశం ఉందని కిరణ్‌కుమార్ రెడ్డికి టి. సుబ్బరామిరెడ్డి  చెప్పారని సమాచారం.

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కిరణ్‌కుమార్ రెడ్డి కూడ సానుకూలంగానే ఉన్నారని  సుబ్బారామిరెడ్డి చెబుతున్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి కిరణ్‌కుమార్ రెడ్డి చివరి సీఎంగా పనిచేశారు. 

అతి తక్కువ వయస్సులోనే సీఎంగా బాధ్యతలు చేపట్టిన వారిలో కిరణ్‌కుమార్ రెడ్డి ఒకరు.  దీంతో కిరణ్ కుమార్ రెడ్డి సేవలను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. 

ఏపీ రాష్ట్ర ఇంచార్జీగా బాధ్యతలను చేపట్టిన ఉమెన్ చాందీ పార్టీకి దూరమైన నేతలను తిరిగి పార్టీలోకి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులను ఆదేశించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూడ   పార్టీకి దూరమైన నేతలను పార్టీలోకి రప్పించేందుకు చర్యలు తీసుకొంటున్నారు.

త్వరలోనే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులతో కిరణ్‌కుమార్ రెడ్డి సమావేశమయ్యే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని  మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కూడ కిరణ్‌కుమార్ రెడ్డికి సలహా ఇచ్చారని సమాచారం. ఈ సలహా మేరకు కిరణ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.