చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా భర్త సెల్వమణి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండే ఆయన చంద్రబాబుపై అటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.  

వైఎస్సార్‌సీపీ శనివారం నగరిలో నిర్వహించిన సభలో సెల్వమణి ప్రసంగించారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి చంద్రబాబుకు సిగ్గు, శరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఒకప్పటి చంద్రబాబుకి, ఇప్పటి చంద్రబాబుకి చాలా తేడా ఉందని ఆయన అన్నారు. 

చంద్రబాబు నమ్మక ద్రోహి అని ఆయన అన్నారు. 2004లో చంద్రబాబును అభిమానించానని, కానీ 2014లో చంద్రబాబు అసలు స్వభావం తెలిసి అసహ్యించుకున్నానని ఆయన తెలిపారు. 

ప్రజలకు సేవచేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఎమ్మెల్యే రోజా తెలిపారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారని ఆమె అన్నారు. దొంగలు, రౌడీలు, జన్మభూమి కమిటీలో సభ్యులుగా ఉన్నారని.. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆమె అన్నారు. 

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి మానసిన స్థితి బాగోలేదని వైఎస్సార్‌సీపీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. మానసిక పరిస్థితి బాగోలేని వ్యక్తి సీఎంగా కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు. 

చంద్రబాబును ఆయన నరకాసురుడిగా అభివర్ణించారు. వచ్చే ఎన్నికల తరువాత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం కావడం ఖాయమని, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే రోజాకు కీలక పదవి లభిస్తుందని ఆయన అన్నారు.