గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ఆయన ప్రభుత్వ మాటలు చూస్తే ఆకాశమంత వున్నాయని... చేతలు మాత్రం అరిటాకంత వున్నాయంటూ తెలుగు దేశం పార్టి ఏపీ అధ్యక్షులు కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. రైతులకు అది చేస్తాం, ఇది చేస్తామని నమ్మించి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఏమి చేయకుండా వారి పాలిట నమ్మక ద్రోహుల్లా మిగిలిపోయారని అన్నారు. రైతులపై ప్రేమ మాటల్లో తప్ప చేతల్లో చూపడంలేదన్నారు. ఇది రైతు ప్రభుత్వం కాదు...రైతు దగా ప్రభుత్వమని వెంకట్రావు మండిపడ్డారు. 

''ఖరీఫ్ మొదలై నెల రోజులు దాటినా ఇంతవరకు ఖరీఫ్ ప్రణాళిక ఖరారు కాలేదు. ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణ లక్ష్యం రూపొందించలేదు. రుణ ప్రణాళిక ఖరారు చెయ్యడం కోసం ప్రభుత్వం బ్యాంకర్లతో సమావేశం కాలేదు. ఇంత వరకు రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులో లేక మార్కెట్ లో అధిక ధరలకు  కొనుగోలు చేస్తున్నారు'' అని అన్నారు. 

''నకిలీ, కల్తీ విత్తనాలు అమ్ముతూ సీడ్ మాఫీయా వందల కోట్లు దంటుకొంటున్నది. కొన్ని విత్తన సంస్థలు నకిలీ, కల్తీ విత్తనాలు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నా వారిపై చర్య తీసుకోవడానికి ప్రభుత్వం తటపటాయిస్తుంది. ప్రవేటు పత్తి విత్తన సంస్థల నాణ్యత లోపించింది. ప్రభుత్వం రైతులకు సబ్సీడీపై పంపిణీ చేస్తున్న వేరు శనగ కాయల్లో పెద్ద ఎత్తున నాసిరకం ఉన్నట్లు బయటపడినా ప్రభుత్వం పట్టించుకోలేదు'' అని  తెలిపారు.  

read more  అమరావతిలో భూ కుంభకోణం: డిప్యూటీ కలెక్టర్ మాధురి సస్పెన్షన్

''ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఆచరణకి నోచుకోలేదు. ధాన్యం అమ్మిన డబ్బులు రాక రైతులు ఖరీఫ్ సీజన్ మొదలయ్యి విత్తనాలు, ఎరువులు కొనుగోలు కోసం బయట నుంచి వడ్డీలకు తెస్తున్నారు. కౌలు రైతులు పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ధాన్యం డబ్బులు కోసం రైతులు అధికారులు చుట్టూ తిరుగుతున్నారు'' అని అన్నారు. 

'' అట్లాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లోను వ్యవసాయ రంగాన్ని దారుణంగా దగా చేసింది. ప్రభుత్వం వ్యవసాయానికి పెట్టిన రూ 29 వేల కోట్ల బడ్జెట్ కూడా అంకెల గారడీయే తప్ప వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా నిధులు పెంచింది ఏమి లేదు. నరేగా నిధులు, విపత్తు నిధి, స్థిరీకరణనిధి, విద్యుత్తు సబ్సిడీ  అన్నింటిని వ్యవసాయ రంగానికి చూపించి రూ 29 వేలకోట్లు వ్యవసాయ రంగానికి పెట్టినట్లు రైతులను మాయ చేశారు. ప్రభుత్వానికి దోచుకోవడం పై ఉన్న ధ్యాస రైతులను ఆదుకోవడం లేదని వారి చర్యలు ద్వారా అర్ధం అవుతుంది''  అని మండిపడ్డారు. 

''ఇంతవరకు ఏ గ్రామంలోను కౌలుదార్లను గుర్తించలేదు. రైతు భరోసా పధకంలో కులాలను విభజన చేయడం అంటే అంత కంటే దారుణం మరొకటి ఉండదు. రైతు కి రైతు కులం తప్ప మరో కులం ఉండదు. రైతుల పట్ల చిలక పలుకులు కాదు చిత్త శుద్ధి కావాలి. ఇది రైతు ప్రభుత్వం కాదు రైతు దగా ప్రభుత్వం అని  రైతులు గుర్తించాలి'' అంటూ జగన్ ప్రభుత్వంపై కళా వెంకట్రావు  విరుచుకుపడ్డారు.