అమరావతి: అమరావతి పరిధిలోని నెక్కల్లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ నెల 3వ తేదీన ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

రాజధానిలో భూ అక్రమాలకు పాల్పడినట్టుగా ఆమెపై అభియోగాలు ఉన్నాయి.  అమరావతిలో భూ కుంభకోణంలో సీఆర్‌డీఏ డిప్యూటీ కలెక్టర్ మాధురిని ఈ నెల 3వ తేదీన సిట్ బృందం అరెస్ట్ చేసింది. రెండు రోజుల పాటు ఆమెను విచారించారు.

 ఆ తర్వాత ఆమెను రిమాండ్ కు తరలించారు.2016 లో రాజధాని ప్రాంతంలో ఓ వ్యక్తికి చెందిన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.

ప్రస్తుతం ఆమె రాయపూడి డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తోంది.  మాధురి 3 ఎకరాల 20 సెంట్ల భూ వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ఆమె ప్రభుత్వానికి సుమారు రూ. 6 కోట్లకు పైగా నష్టం కల్గించేలా వ్యవహరించారని సిట్ అధికారులు ఆరోపిస్తున్నారు.

ఏపీ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మాధురి నెక్కల్, అనంతవరం, రాయకల్ లో డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. 
టీడీపీ నేత రావెల గోపాలకృష్ణకు డిప్యూటీ కలెక్టర్ మాధురి అక్రమంగా భూములను రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. మాధురిని సస్పెండ్ చేస్తూ ఇవాళ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.