ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సోమవారం నెల్లూరు  జిల్లాలో పర్యటించారు. అయితే సీఎం జగన్ నెల్లూరు పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసకున్నట్టుగా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సోమవారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. అయితే సీఎం జగన్ నెల్లూరు పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసకున్నట్టుగా తెలుస్తోంది. నెల్లూరు పర్యటన నేపథ్యంలో.. సీఎం జగన్ ఉదయం.. గన్నవరం ఎయిర్‌ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌‌లో నెల్లూరు పోలీసు కవాతు మైదానంలోని హెలిప్యాడ్‌కు వచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు చేరుకుని.. అక్కడ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంస్మరణలో సభలో పాల్గొన్నారు. 

అనంతరం సీఎం జగన్ తిరిగి తాడేపల్లిలోని నివాసానికి బయలుదేరారు. సీఎం జగన్ పర్యటన సందర్భంగా అధికారులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే ఓ విద్యార్థి భద్రతా వలయాన్ని ఛేదించుకుని హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నాడు. తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీయసాగాడు. అయితే దీనిని భద్రత సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. విద్యార్థిని అదుపులోకి తీసుకని ప్రశ్నిస్తున్నారు. 

అయితే పోలీసుల భద్రతను దాటుకుని విద్యార్థి అక్కడివరకు ఎలా వెళ్లగలిగాడు..?, విద్యార్థి అక్కడికి వచ్చేవరకు పోలీసులు ఎందుకు గుర్తించలేదు..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆ విద్యార్థి అక్కడి ఏ విధంగా వచ్చాడనేది తెలియాల్సి ఉంది. అతడు సాధారణంగా హెలిప్యాడ్ వద్దకు వచ్చి ఫొటోలు తీశాడా..? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

ఇక, నెల్లూరులో నేడు గౌతమ్ రెడ్డి సంస్మరణ సభకు సీఎం జగన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గౌతమ్‌ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. గౌతమ్ రెడ్డి లేరన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని చెప్పారు. చిన్నప్పటి నుంచి గౌతమ్ రెడ్డితో పరిచయం ఉందని గుర్తుచేసుకున్నారు. ప్రతి అడుగులోనూ గౌతమ్‌రెడ్డి నాకు తోడుగా ఉన్నారు. గౌతమ్ రెడ్డి లాంటి మంచి వ్యక్తిని పోగొట్టుకున్నందుకు బాధగా ఉందన్నారు. గౌతమ్ రెడ్డితో సాన్నిహిత్యం చెప్పలేనిదన్నారు. 

రాజకీయాల్లోని గౌతమ్‌ను తానే తీసుకువచ్చానని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు గౌతమ్ వల్లే రాజమోహన్ రెడ్డి మద్దతు లభించిందన్నారు. 2009 నుంచి సాగిన ఆ ప్రయాణంలో స్నేహితుడిగా గౌతమ్ ప్రతి అడుగులో తోడుగా ఉన్నాడని చెప్పారు. గౌతమ్ రెడ్డి తనకంటే ఒక ఏడాది పెద్దవాడని.. అయినా ఏ రోజు అలా ఉండేవాడు కాదని తెలిపారు. తననే అన్నగా భావించేవారని అన్నారు.

పరిశ్రమల శాఖ సహా 6 శాఖలను గౌతమ్ రెడ్డి నిర్వహించారని గుర్తుచేసుకున్నారు. చివరి క్షణం వరకు రాష్ట్రాభివృద్ది కోసం గౌతమ్ రెడ్డి శ్రమించారని తెలిపారు. మంచి మంత్రిగా, ఎమ్మెల్యేగా, స్నేహితుడిగా గౌతమ్ రెడ్డి నిలిచారని సీఎం జగన్ చెప్పారు. గౌతమ్ రెడ్డి కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. గౌతమ్ రెడ్డి గురించి ఎంత చెప్పినా ఆ లోటును భర్తీ చేయలేమని అన్నారు. గౌతమ్ రెడ్డి పేరు చిరస్థాయిగా ఉండేలా కార్యక్రమం చేపడతామని తెలిపారు. మే 15 లోగా సంగం బ్యారేజ్ పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. సంగం బ్యారేజికి మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజ్‌గా నామకరణం చేస్తున్నట్టుగా చెప్పారు.