తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురువారం నాడు టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ వర్గాల మధ్య   చోటు చేసుకొన్న ఘర్షణల నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నారు. 

తాడిపత్రిలో 144 సెక్షన్ విధించారు.  పోలీస్ యాక్ట్ 30 ని అమల్లోకి తెచ్చారు. టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణకు కారణమైన సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన  వలీ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

also read:దాడికి వెళ్లలేదు, వాళ్లే దాడి చేశారు: జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే కేతిరెడ్డి ఫైర్

సోషల్ మీడియాలో  తాడిపత్రి ఎమ్మెల్యే  కేతిరెడ్డి పెద్దారెడ్డికి వ్యతిరేకంగా  పోస్టు పెట్టారు. ఇసుక తరలింపు విషయంలో  డబ్బులు తీసుకొంటున్నారని ఓ ఆడియో సంభాషణ వివాదానికి కారణమైంది. 

ఈ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్  గా మారింది.ఈ ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావడానికి టీడీపీ కారణమని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు. 

జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు ఈ పోస్టును సోషల్ మీడియాలో పెట్టారని ఆయన భావిస్తున్నారు.ఇదే విషయమై మాట్లాడేందుకు జేసీ ఇంటికి వెళ్లిన సమయంలో ఘర్షణ చోటు చేసుకొందని పెద్దారెడ్డి ప్రకటించారు.

సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని ఆరోపిస్తూ ఇద్దరిపై పెద్దారెడితో పాటు ఆయన అనుచరులు దాడికి దిగారు.  జేసీ వర్గీయులు పెద్దారెడ్డి వర్గీయులపై రాళ్ల దాడికి దిగారు. ఇరువర్గాల రాళ్ల దాడిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీచార్జీ కూడా చేశారు. లాఠీచార్జీని కూడా లెక్క చేయకుండా ఇరువర్గాలు రాళ్లదాడికి దిగారు.

రాళ్ల దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు సీసీటీవీ పుటేజీని పోలీసులు ఉపయోగిస్తున్నారు. ఈ ఘటనపై  జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ, ఈ విషయాన్ని పోలీసులు సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేశారు.