న్యాయస్ధానంలో కెసిఆర్ ప్రభుత్వం మాటమార్చింది పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త భవనాలు నిర్మించనున్నారట వాస్తు ప్రకారం లేనందునే భవనాలను కూల్చేస్తున్నట్లు చెప్పలేకపోయింది 10 రోజులు స్టే ఇచ్చిన న్యాయస్ధానం
న్యాయస్ధానంలో కెసిఆర్ ప్రభుత్వం మాట మార్చింది. వాస్తు ప్రకారం కొత్తగా నిర్మించే ఉద్దేశ్యంతోనే ఇపుడున్న సచివాలయాన్ని కూలగొడుతున్నట్లు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రభుత్వం న్యాయస్ధానంలో మాత్రం ఆ మాట చెప్పలేకపోయింది. పరిపాలనా సౌలభ్యం కోసమే ఇపుడున్న సచివాలయం భవనాలను కూలగొట్టాలని అనుకుంటున్నట్లు అఫిడవిట్ దాఖలు చేయటం గమనార్హం. ప్రస్తుత భవనాలు వాస్తుకు అనుగుణంగా లేవని కూలగొట్టాలని కెసిఆర్ అనుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే
అయితే, పరిపాలనా సౌలభ్యం కోసమని అఫిడ్ విట్ దాఖలు చేసిన ప్రభుత్వం అందులో పేర్కొన్న కారణాలు మాత్రం విచిత్రంగా ఉన్నాయి. ప్రభుత్వం చెప్పిన కారణాల్లో నాలుగు ముఖ్యమైనవి. వర్షాలు వస్తున్నపుడు ఒక భవనం నుండి మరోక బవనంకు వెళ్లటానికి ఇబ్బందిగా ఉందని చెప్పింది. అగ్నిప్రమాదాలు సంభవించినపుడు తప్పించుకునేందుకు తగిన ఏర్పాట్లు లేవని, లిఫ్ట్ పాతబడిపోయిందని, వాహనాల పార్కింగ్ కు సరిపడా స్ధలం లేదన్న సిల్లీ కారణాలను చెబుతున్నది.
ఎవరైనా సరే పైన చెప్పిన కారణాల వల్ల సచివాలయంలోని మొత్తం 8 బ్లాకులను కూలగొట్టుకుంటారా అన్నది ప్రశ్న. వర్షాలు పడుతున్నపుడు ఒక బ్లాకు నుండి మరోక బ్లాకుకు పోవటం ఏమంత పెద్ద కష్టం. అవసరమైతే వర్షం తగ్గిన తర్వాత వెళితే సరిపోతుంది. లేదా వాహనాల్లో వెళతారు. అంతే కానీ వర్షాల్లో తడుస్తు వెళ్లాలని ఏమీ లేదు కదా? పైగా వర్షాల్లో తడుసుకుంటూ వెళ్ళే మంత్రులు, నేతలెవరైనా ఉన్నారా?
ఇక, అగ్నిప్రమాదాల విషయం. ప్రమాదాలు సంభవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అవసరమైతే సచివాలయంలో ఏకంగా ఫైర్ స్టేషనే పెట్టుకుంటే సరిపోతుంది కదా? లిఫ్టులు పాతపడిపోయాయన్నది మూడో కారణం. పాతవైపోయిన లిఫ్టులను సర్వీసింగ్ చేయించినా లేక పాతవాటి స్ధానంలో కొత్తవి ఏర్పాటు చేసుకున్నా సరిపోతుంది. వాహనాల పార్కింగ్ కు సరిపడా స్ధలం లేకపోవటం. ఈ కారణంలో కూడా ఏమాత్రం వాస్తవం లేదని ఎవరికైనా తెలిసిపోతుంది.
రెండు ప్రభుత్వాలున్నపుడు వాహనాల పార్కింగ్ కు ఇబ్బందులున్న మాట వాస్తవమే. అయితే, ఇపుడు ఏపి ప్రభుత్వం ఇక్కడి నుండి తరలిపోయింది. కాబట్టి ఏపి ఆధీనంలో ఉన్న నాలుగు బ్లాకులకు సంబంధించిన స్ధలాన్ని వాడుకున్నా అడిగేవారే లేరు. కాబట్టి ఇపుడు అవసరమైన దానికన్నా ఎక్కవ పార్కింగ్ స్ధలమే వస్తుంది. ఇపుడున్న 8 బ్లాకుల్లో డి, నార్త్ హెచ్, నార్త్ ఎస్ ఇటీవలే నిర్మించనవి. పైగా నార్త్ రెండు బ్లాకులకు ఏపి ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించింది.
అదేవిధంగా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయడున్న ఎల్ బ్లాకుకు కూడా కోట్లాది రూపాయలను వ్యయం చేసింది. పై మూడు బ్లాకుల మరమత్తులకు, సుందరీకరణకే దాదాపు రూ. 50 కోట్లు వ్యయం అయిందని అంచనా. అటువంటిది ఇప్పటికిప్పుడు వాటిని కూడా కొట్టేయాలని కెసిఆర్ నిర్ణయించారంటే ప్రజాదనం వృధాకాక మరేమిటి? ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం లేదని ఎవరైనా అనగలరా? విపక్షాలు దాఖలు చేసిన కేసులో పస వుంది కాబట్టే న్యాయస్ధానం విచారణకు స్వీకరించి మంగళవారం జరిగిన విచారణలో 10 రోజుల పాటు స్టే ఇచ్చింది. ఈ పదిరోజుల్లో ఎటువంటి కూల్చివేతలూ వద్దని చెప్పిందంటేనే న్యాయస్ధానం కూల్చివేతల విషయంలో ఎంత సీరియస్ గా ఉందో తెలుస్తోంది.
