పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అభ్యంతరాలపై స్పందించారు ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్. ఈ మేరకు ఆదివారం రెండు పేజీల లేఖను విడుదల చేశారు.

పోలింగ్ సిబ్బంది భద్రతకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల నిర్వహణకు అంతా సహకరించాలని.. పీపీఈ కిట్లు, ఫేస్‌షీల్డ్, మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో వుంచుతామని నిమ్మగడ్డ తెలిపారు.

Also Read:స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెనక్కి తీసుకోవాలి: ఏపీ ఎన్జీవో నేత చంద్రశేఖర్ రెడ్డి

ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీలో ప్రాధాన్యమివ్వాలని.. రాజకీయ పార్టీల విస్తృతాభిప్రాయం మేరకే ఎన్నికల నిర్వహణ చేపడతున్నట్లు ఆయన వెల్లడించారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాజకీయాలతో సంబంధం వుండదని.. పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహిస్తే ఫైనాన్స్ కమీషన్ నిధులు వస్తాయని నిమ్మగడ్డ గుర్తుచేశారు. రాజ్యాంగం ప్రకారం పంచాయతీ ఎన్నికల నిర్వహణ తప్పనిసరని ఆయన చెప్పారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా సామాజిక నాయకత్వం ఏర్పడుతుందని ఎస్ఈసీ అభిప్రాయపడ్డారు. ఏపీ ఉద్యోగులకు ఎవరూ సాటిరారని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో కష్టపడి పనిచేసిన గుర్తింపు ఏపీ ఉద్యోగులకు వుందని ఆయన చెప్పారు.