విజయవాడ: ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ను వెనక్కి తీసుకోవాలని ఏపీ ఎన్‌జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఆదివారం నాడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కరోనా కారణంగా చాలా మంది ప్రజలు, ఉద్యోగులు ప్రాణాలను కోల్పోయారన్నారు. స్థానిక ఎన్నికలు వద్దని  ఎస్ఈసీకి విన్నవించినా కూడ పట్టించుకోవడం లేదన్నారు.

కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం షెడ్యూల్ విడుదల చేయడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఉద్యోగ సంఘాల్లో పనిచేసి రాజకీయాల్లో ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్సీ ఆశోక్ బాబుపై ఆయన విమర్శలు గుప్పించారు. రాజకీయ పార్టీలకు మస్కాలు కొట్టడం తమకు చేతకాదన్నారు. ఉద్యోగ సంఘాలపై ఆశోక్ బాబు ఆరోపణలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది.  కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కూడ ఈ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఈ విషయాలను ఎస్ఈసీకి  రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల విధుల్లో ఉద్యోగులు పాల్గొనడం ప్రాణాలకు తెస్తోందని గతంలోనే ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు.