మొదట ప్రతిపక్ష నేత చంద్రబాబుతో కలిసి తమను ఇబ్బంది పెట్టాలని ఎస్ఈసి నిమ్మగడ్డ చూసారని... కానీ ప్రజల మద్దతు చూశాక మారిపోయారని డిప్యూటీ సీఎం నాారాయణ స్వామి పేర్కొన్నారు. 

తిరుపతి: ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ తీరులో మార్పు వచ్చిందని... ఎన్నికల ఫలితాలని చూశాక ఆయన రియలైజ్‌ అయ్యారన్నారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. మొదట ప్రతిపక్ష నేత చంద్రబాబుతో కలిసి తమను ఇబ్బంది పెట్టాలని చూసారని... కానీ ప్రజల మద్దతు చూశాక ఆయన మారిపోయారన్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా నిమ్మగడ్డ వల్లే ఓడిపోయామంటూ తిడుతున్నారని నారాయణ స్వామి పేర్కొన్నారు. 

ఇదిలావుంటే ఎన్నికల్లో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలు జరిగాయన్న ఫిర్యాదులపై స్పష్టత ఇచ్చింది ఎస్ఈసీ. బలవంతపు నామినేషన్ల ఉపసంహరణలపై ఫిర్యాదులను స్వీకరించాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది ఎస్ఈసీ. వచ్చే నెల రెండో తేదీ లోగా ఫిర్యాదులను కమీషన్‌కు పంపాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అభ్యర్ధిత్వాల పునరుద్దరణలపై నిర్ణయం తీసుకుంటామని ఎస్ఈసీ స్పష్టం చేశారు. బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ వంటి సంఘటనలు జరిగితే అభ్యర్ధిత్వాలను పునరుద్ధరించే అధికారం ఎస్ఈసీకి వుందంటున్నారు నిమ్మగడ్డ. 

read more కుప్పంలో చీత్కారం.. ఇక చరమాంకంలో రాజకీయ జీవితం: బాబుపై సజ్జల వ్యాఖ్యలు

 తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌తో సమావేశమయ్యారు ఏపీ సీఎస్ ఆదిత్య నాథ్ దాస్. మూడో విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీకి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో పుంగనూరు, మాచర్లలో ఏకగ్రీవాలపై ప్రస్తావన వచ్చినట్లు సమాచారం.

అరగంట పాటు ఈ సమావేశం సాగినట్లుగా తెలుస్తోంది. మూడో విడతలో13 జిల్లాల్లో 19 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లోని.. 3,221 పంచాయితీలు, 31,516 వార్డు స్ధానాలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 579 ఏక గ్రీవాలు కాగా... ఫిబ్రవరి 17న 2640 సర్పంచ్.. 19,607 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉంది.. సర్పంచ్ పదవులకు బరిలో 7756 మంది నిలిచారు.