విద్యార్థులతో ప్రయాణిస్తున్న ప్రైవేట్ స్కూల్ బస్సును సిమెంట్ లోడ్ లారీ ఢీకొట్టిన ఘటన ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో చోటుచేసుకుంది.

విజయవాడ : ఇవాళ(బుధవారం) ఉదయం ఎన్టీఆర్ జిల్లాలో పెనుప్రమాదం తప్పింది. విద్యార్థులను స్కూల్ కు తరలిస్తున్న ఓ బస్సును లారీ ఢీకొట్టింది. అయితే ప్రమాద సమయంలో రెండు వాహనాలు తక్కువవేగంతోనే వుండటం... రెండు వాహనాలు డ్రైవర్లు వెంటనే అప్రమత్తం కావడంతో ప్రాణాపాయం తప్పింది. 

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రోజూ మాదిరిగానే ఇవాళ ఉదయం విద్యార్థులను తరలిస్తోంది. అయితే ఫ్యాక్టరీ సెంటర్ సమీపంలో సిమెంట్ లోడ్ తో వెళుతున్న లారీ అదుపుతప్పి ఈ స్కూల్ బస్సును ఢీకొట్టింది. స్కూల్ బస్సును వెనకవైపు నుండి ఢీకొట్టిన లారీ వెంటనే ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులోని విద్యార్థులెవ్వరికీ ఎటువంటి ప్రమాదం జరలేదు. కేవలం బస్సు మాత్రమై స్వల్పంగా దెబ్బతినగా విద్యార్థులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

ఇదిలావుంటే ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో ఓ తొమ్మిదేళ్ల చిన్నారిని హాస్టల్ నుండి అపహరించిన దుండుగులు అతి దారుణంగా హతమార్చిన దారుణం వెలుగుచూసింది. గిరిజన సంక్షేమ హాస్టల్లో ఉంటున్న విద్యార్థి హత్య స్థానికంగా కలకలం సృష్టించింది.

Read More ప్రకాశం జిల్లాలో సాగర్ కాల్వలోకి దూసుకెళ్లిన పెళ్లి బస్సు, ఏడుగురు మృతి

సోమవారం అర్ధరాత్రి సమయంలో గిరిజన సంక్షేమ హాస్టల్లోకి చొరబడ్డ దుండుగులు నాలుగో తరగతి చదివే అఖిల్(9) ను అపహరించుకుపోయారు. తెల్లవారేసరికి హాస్టల్ సమీపంలో అఖిల్ మృతదేహంగా తేలాడు. ముగ్గురు దుండగులు రాత్రి హాస్టల్లోకి వచ్చి అఖిల్ ను తీసుకుపోయినట్లు మిగతా విద్యార్థులు చెబుతున్నారు.ఆ ముగ్గురు దుండుగులు ఎవరు? అఖిల్ ను ఎందుకు చంపారు? అనేది తెలియాల్సి వుంది. 

బుట్టాయిగూడెం పోలీసులు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవని పోలీసులు చెబుతున్నారు. దీంతో బయటి వ్యక్తులు హత్య చేశారా? విద్యార్థే ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.