ప్రభుత్వ ఉద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్బీఐ శాఖల ద్వారా జీతాలు తీసుకుంటే వారందరికీ ప్రత్యేక ప్యాకేజీ తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీ కిందికి వచ్చిన వారి వేతన ఖాతాలను స్టేట్ గవర్నమెంట్ శాలరీ గా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాల సేవింగ్ ఖాతాలను ఎస్బీఐ ప్రకటించిన స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీగా మార్చుకోవాల్సి ఉంటుంది.

అలా మార్చుకుంటే  ఇతర ఖాతాదారులతో పోలిస్తే కొన్ని మెరుగైన సేవలు, రాయితీలు, ప్రయోజనాలు పొందవచ్చని ఎస్బీఐ అధికారులు  చెబుతున్నారు. ఏదైనా సేవింగ్స్ ఖాతాలో కనీసం రూ.500 నిల్వ ఉండాలనే నిబంధన ఉంది. అయితే ఎస్జీఎస్పీ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్ ఉన్నా ఎలాంటి జరిమానా  పడదు. ఈ ఖాతాలు ఉన్నవారు ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసుకునే విషయంలో కూడా పరిమితులు ఉండవు.

సాధారణంగా వ్యక్తిగత రుణం తీసుకున్నవారు ప్రమాదవశాత్తు చనిపోతే రూ.20లక్షల వరకు బీమా ఉంటుంది. ఇందుకోసం రుణం తీసుకున్న సమయంలో ఖాతాదారే ప్రీమియం  చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎస్జీఎస్పీ ఖాతాదారులకు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండానే రూ.30లక్షల బీమా వర్తిస్తుంది. 

వ్యక్తిగత, గృహ, విద్యా రుణాలు తీసుకున్నవారి నుంచి బ్యాంకులు రుణం మొత్తం ఆధారందగా ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి. ఎస్జీఎస్పీ ఖాతాదారులు తీసుకునే రుణాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులో 50శాతం రాయితీ లభిస్తుంది. లాకర్ ఛార్జీల్లో 25శాతం రాయితీ పొందవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా వీరికి ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఉంటుంది. ఖాతాలో నగదు లేకపోయినా రెండు నెలల వేతనంతో సమానమైన మొత్తం వరకూ తీసుకోవచ్చు.

కాగా.. నిర్ణయించిన గడువులోగా దీనిని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎంపిక చేసిన ఖాతాదారులకు మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుందని ఎస్బీఐ అధికారులు తెలిపారు.