కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపిరేవుల టోల్‌ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి సజీవదహనం అయ్యాడు. గూడ్స్ కొరియర్ లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. ఈ  ప్రమాదంలో కారులో ప్రయాణిస్తూన్న ఎస్‌బీఐ బ్యాంక్ ఉద్యోగి శివకుమర్ సజీవదహనం అవగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. గాయపడిన వ్యక్తిని పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఎస్బీఐ ఉద్యోగి శివకుమార్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుంచి నంద్యాలకు కారులో బయలుదేరారు. కర్నూలు జిల్లాలోని నంద్యాల సమీపంలో ముందుగా వెళ్తున్న కంటైనర్ వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ఢీకొట్టింది. దీంతో కారు కంటైనర్ లో ఇరుక్కుపోయింది. ప్రమాదాన్ని కంటైనర్ డ్రైవర్ గమనించకపోవడంతో కారును సుమారు 3కిలో మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. 

ఈ క్రమంలో కారులో మంటలు చెలరేగాయి. శివకుమార్(40) దివ్యాంగుడు కావడంతో కారులో నుంచి బయటకు రాలేకపోయాడు. అతని స్నేహితులు మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారని పోలీసులు చెప్పారు.