సత్తెనపల్లి : మాజీ అసెంబ్లీ స్పీకర్, టిడిపి సీనియర్ నేత కోడెల శివప్రసాద్ సూసైడ్ తో సత్తెనపల్లి నియోజకవర్గం పేరు మారుమోగింది. అంతేకాదు మంత్రి అంబటి రాంబాబు వివాదాలతో ఈ నియోజకవర్గం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి బరిలోకి దింపడంతో ఇక్కడి రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి ప్రజల తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. 

సత్తెనపల్లి నియోజకవర్గ రాజకీయాలు :

నరసరావుపేట నుండి కోడెల శివప్రసాద్, రేపల్లె నుండి అంబటి రాంబాబు సత్తెనపల్లి షిప్ట్ కావడంలో ఇక్కడి రాజకీయాలు హీటెక్కాయి. అంతకుముందు వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి స్వాతంత్ర్య సమరయోధులు సత్తెనపల్లి నుండి ప్రాతినిధ్యం వహించారు. గోపాలకృష్ణయ్య సిపిఐ, ఆ తర్వాత నన్నపనేని రాజకుమారి స్వతంత్ర అభ్యర్థిగా, పుతుంబాక వెంకటపతి, భారతి సిపిఎం, యలమంచిలి వీరాంజనేయులు, కోడెల టిడిపి, రావెల వెంకట్, దొడ్డ బాలకోటి రెడ్డి, యర్రం వెంకటేశ్వర్ రెడ్డి వంటివారు కాంగ్రెస్, చివరగా అంబటి రాంబాబు వైసిపి నుండి పోటీచేసి గెలిచారు. అంటే సత్తెనపల్లిలో దాదాపు అన్ని పార్టీలకు ప్రాతినిధ్యం వుందన్నమాట. అయితే కోడెల, అంబటి ఎంట్రీతో సత్తెనపల్లి పాలిటిక్స్ పూర్తిగా మారిపోయాయి. ఈ రెండు పార్టీల చుట్టే రాజకీయాలు సాగుతున్నాయి. 

సత్తెనపల్లి నియోజకవర్గంలోని మండలాలు : 

సత్తెనపల్లి 
రాజుపాలెం 
నకరికల్లు
ముప్పాళ్ల 

సత్తెనపల్లి అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :

సత్తెనపల్లి టిడిపి అభ్యర్థి : 

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలోకి దిగారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రిగా, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ బిజెపి అధ్యక్షుడిగా పనిచేసారు కన్నా. ఇటీవలే టిడిపిలో చేరిన ఆయనను ముందు సత్తెనపల్లి ఇంచార్జీగా నియమించిన టిడిపి ఇటీవల 2014 అసెంబ్లీ ఎన్నికల అభ్యర్ధిగా ప్రకటించింది. 

సత్తెనపల్లి వైసిపి అభ్యర్థి : 

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019లో వైసిపి అంబటి రాంబాబును బరిలోకి దింపి విజయం సాధించింది. ప్రస్తుతం ఆయన జగన్ కేబినెట్ లో మంత్రిగా వున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అంబటి రాంబాబే సత్తెనపల్లి బరిలోకి దిగేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆయన నియోకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. 


సత్తెనపల్లి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

సత్తెనపల్లి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2019: 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గంలో 2,03,731ఓట్లు (88 శాతం) పోలయ్యాయి.

వైసిపి - అంబటి రాంబాబు - 1,05,063 (51 శాతం) ఓట్లు వచ్చాయి - 20,876 ఓట్ల మెజారిటీతో విజయం

టిడిపి - కోడెల శివప్రసాదరావు - 84,187 (41 శాతం) ఓట్లు వచ్చాయి. రెండో స్థానంలో నిలిచారు.

జనసేన - యర్రం వెంకటేశ్వర్ రెడ్డి - 9,279 (4 శాతం)‌ - మూడో స్థానంలో నిలిచారు. 


సత్తెనపల్లి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2014:

ఈ ఎన్నికల్లో టిడిపి విజేతగా నిలిచింది. సత్తెనపల్లిలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 1,69,570 (84 శాతం) ఓట్లు పోలయ్యాయి.

టిడిపి - కోడెల శివప్రసాద్ - 85,247 ( 50 శాతం) ఓట్లు సాధించి గెలిచారు. ఆయన 924 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు. 

వైసిపి - అంబటి రాంబాబు - 84,323 (49 శాతం) ఓట్లు సాధించి ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల్లో అంబటి రెండో స్థానంలో నిలిచారు.