విశాఖపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విషవాయువులు విడుదలై అయిదు కిలోమీటర్ల మేర ప్రజలు భయకంపితులను చేసింది. ఈ దుర్ఘటలనలో ఇప్పటికే 8 మంది మృత్యువాతపడగా వందల మంది తీవ్ర అస్వస్థతకు లోనయ్యీరు. ఈ ప్రమాదంపై స్పందించిన స్థానిక శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర  సరస్వతి స్పందిస్తూ బాధిత కుటుంబాలకే పీఠం తరపున సహకారం అందిస్తామన్నారు. 

ఈ ప్రమాదం కారణంగా ఉన్నపలంగా పుట్టిపెరిగిన ప్రాంతాన్ని, ఇంటికి వదిలిపెట్టి బయటకు వచ్చిన బాధితులకు శారదాపీఠం, వానప్రస్థం సంస్థలు సహాకారం అందించనున్నారని ప్రకటించారు. పదివేల మందికి మధ్యాహ్న భోజనాన్ని అందించాలని నిర్ణయించినట్లు స్వరూపానంద స్వామి వెల్లడించారు. ఈ బాధ్యతలను ట్రస్టీ రొబ్బి శ్రీనివాస్ కు అప్పగించినట్లు స్వామి ప్రకటించారు. 

విశాఖలో విష వాయువు లీకైన ఘటన దురదృష్టకరమని స్వరూపానందేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నానని అన్నారు.  భగవంతుడి ఆశీస్సులతో పరిస్థితి సద్దుమణగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు స్వరూపానందేంద్ర స్వామి. 

విశాఖ నగరంలోని ఓ కంపెనీలో విషవాయువు స్టైరిన్ లీకై పలువురి ప్రాణాలను బలితీసుకున్న విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంటనే సంబంధిత జిల్లా అధికారులను వాకబు చేసారు. సహాయక చర్యల్ని పర్యవేక్షించడానికి స్వయంగా విశాఖకు వెళుతున్న ఆయన భాధితులను  పరామర్శించనున్నారు. 

పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి ఈ విషయం తెలియగానే విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జిల్లా పరిశ్రమల అధికారులతో సంప్రదించారు.  తక్షణమే  ప్రాణ నష్ట నివారణకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలను జారీచేశారు. పరిశ్రమకు చుట్టుపక్కల గ్రామాలైన నరవ, ఆర్.ఆర్ పురం, టైలర్స్ కాలనీ, నరవ, బి.సీ కాలనీ, బాపూజీనగర్, కంచరపాలెం, కృష్ణానగర్ తదితర  ప్రజలకు సాయంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. 

ఉన్నపలంగా ఇళ్లను వదిలి వచ్చిన స్థానిక ప్రజలకు ఏ లోటు లేకుండా చూడాలని కలెక్టర్ కి సూచించారు మంత్రి గౌతమ్ రెడ్డి. జిల్లా యంత్రాంగానికి సహకారంగా చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఆదేశాలను జారీ చేసారు.