అమరావతి: తనను హిందూయేతర వ్యక్తిగా చిత్రీకరించే ప్రచారాలను విశ్వసించవద్దని సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు, మన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సూచించారు. తనపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. 

తన తల్లిదండ్రులు హిందువులని, తాను సైతం హిందూ ధర్మాన్ని పాటిస్తానని ఆమె స్పష్టం చేశారు. తను అన్ని మతాలను గౌరవిస్తానని చెప్పారు. సింహాచలం దేవస్థానంపై, మన్సాస్ ట్రస్టుపై గత చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమాలను బయటకు తీస్తున్నామని, అందుకే తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, అందువల్ల తన గురించి చేసిన వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ సరిదిద్దుకోవాలని ఆమె అన్నారు. 

దానికి సంబంధించి పవన్ కల్యాణ్ మరో ప్రకటన విడుదల చేయాలని లేదా తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. హుందాతనం ఉన్న వ్యక్తిగా పవన్ కల్యాణ్ నుంచి తాను అది మాత్రమే ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు. 

మన్సాస్ ట్రస్ ఒక హిందూయేతర వ్యక్తి నేతృత్వంలో ఉందని పవన్ కల్యాణ్ అన్నారని, అందుకే నిజాలను పవన్ కల్యాణ్ దృష్టికి తెస్తున్నానని ఆమె అన్నారు. ఆనంద గజపతి రాజు, ఉమా గజపతి రాజుల పెద్ద కూతురినని, తమ అమ్మ పునర్వివాహం చేసుకున్న రమేష్ శర్మ కూడా హిందూ పురోహిత కుటుంబం నుంచి వచ్చారని ఆమె వివరించారు. 

ఆయన ఆరు సార్లు జాతీయ అవార్డు పొంది, ఒకసారి ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన ఫిల్మ్ మేకర్ అని ఆమె చెప్పారు. టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, పచ్చి అబద్ధాలను నమ్మవద్దని ఆమె పవన్ కల్యాణ్ కు సలహా ఇచ్చారు. 

మీ లాగే నేను కూడా ఓ హిందువుగా అన్ని మతాలను గౌరవిస్తానని ఆణె పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు, ఆయన అనుచరవర్గం చేస్తున్న తప్పుడు ప్రచారానికి, కట్టుకథలకు మీ ప్రకటన ద్వారా అడ్డుకట్ట వేయాలని కోరుతున్నానని సంచయిత అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆమె పవన్ కల్యాణ్ కు విజ్ఞప్తి చేశారు.