పార్లమెంటు ఉభయ సభల్లోనూ గడచిన ఐదురోజులుగా ఒకే గోల నడుస్తోంది. అదేంటంటే, అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకోవటమే ఏకైక లక్ష్యంగా కనబడుతోంది. ఎన్డీఏ పక్షాలే తెర వెనుక నుండి నాటకాలు ఆడిస్తున్నట్లు వినబడుతున్న ఆరోపణలు సభలో జరుగుతున్న ఆందోళనలు కూడా ఊతమిస్తున్నాయ్. ఎందుకంటే, ఒకే అంశంపై ఏఐఏడిఎంకె, టిఆర్ఎస్ లు సభలో గందరగోళం సృష్టిస్తున్నాయి కాబట్టే అందరిలోనూ అనుమానాలు.

కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసిపి, టిడిపిలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను ఏ రోజుకారోజు స్పీకర్ చదివి వినిపించటం, సభ ఆర్డర్లో లేదు కాబట్టి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించటం నిత్య కృత్యమైపోయింది. గురువారం కూడా సభలో సేమ్ సీన్ రిపీటైంది. సభ్యులు ప్రశాంతంగా కూర్చోకపోతే హెడ్ కౌంట్ సాధ్యం కాదని స్పీకర్ ఎంత చెబుతున్నా ఆందోళన చేస్తున్న సభ్యులు పట్టించుకోవటం లేదంటే ఏమిటర్దం? పైగా ఏఐఏడిఎంకె, టిఆర్ఎస్ సభ్యులకు అదనంగా మధ్య మధ్యలో టిడిపి సభ్యులు కూడా ఆందోళనలకు దిగటం ఆశ్చర్యంగా ఉంది.

అవిశ్వాస తీర్మానం సభలో చర్చకు రాకుండా ఎన్డీఏ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఒకవైపు అవిశ్వాస తీర్మానంపై చర్చకు రెడీ అంటూనే ఇంకోవైపు సభను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుని వెళ్ళిపోతోంది. ఇక్కడే ఎన్డీఏ ప్రధాన భాగస్వామి బిజెపి వైఖరి బయటపడుతోంది.