తాడేపల్లి: ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య పోతిరెడ్డిపాడు వివాదాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కృష్ణా నదిపై నిర్మించిన, నిర్మిస్తున్న ప్రాజెక్టులు, జలాల వాటా విషయంలో కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఇరు రాష్ట్రాలు ఫిర్యాదుచేశారు. దీంతో ఇంతకాలం సఖ్యతగా వున్న ముఖ్యమంత్రుల మధ్య మాటలయుద్దం పెరగనుందని అందరూ భావిస్తున్నారు. కానీ అలా జరిగే అవకాశం లేదని...  ఇప్పటిలాగే ఇకపై కూడా పక్కరాష్ట్రంతో కలిసే తాము పనిచేస్తామని ఏపి ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. 

అసలు పోతిరెడ్డిపాడు కెపాసిటీని 44 వేల క్యూసెక్కులకు పెంచింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని తెలిపారు. కానీ చంద్రబాబు తానే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటిని అందించానని అబద్దాలు మాట్లాడుతున్నారని సజ్జల ఆరోపించారు.

''కరోనా వైరస్ ను ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొంది.  దేశంలో అత్యధికంగా టెస్టులను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అన్ని వ్యవస్థలు కరోనా వైరస్ ఎదుర్కొనడంలో సమర్ధవంతంగా పని చేశాయి. అన్ని వ్యవస్థలను సీఎం ముందుకు నడిపించారు'' అని సజ్జల పేర్కొన్నారు. 

''వలస కార్మికుల విషయంలో మానవీయ కోణంలో సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్ కార్మికుల విషయంలో ఆ ప్రభుత్వం నుంచి పంపేందుకు అనుమతి రాలేదు. దాన్ని కూడా వివాదం చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నించాయి'' అని అన్నారు.  

read more ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు... హైకోర్టులో ముగిసిన వాదనలు, తీర్పు...

''ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో ప్రభుత్వం స్పందించిన తీరు అద్భుతం. బాధితులను సీఎం వెంటనే పరామర్శించారు. చనిపోయిన వారి కుటంబాలకు స్పాట్ లోనే కోటి పరిహారం ప్రకటించారు. ప్రమాదం జరిగిన పది రోజుల్లో బాధితులు అందరికి పరిహారం అందింది'' అన్నారు. 

''కరోనా వైరస్ కంటే డేంజర్ వైరస్ ఎల్లో వైరస్. ఈ ఎల్లో వైరస్ ప్రజల మెదడులు తినేస్తుంది. ఎల్లో మీడియా కరోనా వైరస్ పై తప్పుడు ప్రచారం చేస్తోంది. కరోనా వైరస్ పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విష పూరిత రాతలు రాస్తున్నారు. కరోనాను అడ్డం పెట్టుకొని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు'' అని మండిపడ్డారు. 

''రాష్ట్ర ప్రభుత్వ చర్యలను కేంద్ర ప్రభుత్వం మంత్రులు ప్రశంసిస్తున్నారు. సద్బుద్ధితో చంద్రబాబు కూడా సీఎం కు మంచి సలహాలు ఇవ్వొచ్చు. చంద్రబాబు ప్రచార పిచ్చికి 30 మంది పుష్కరాల్లో చనిపోయారు. జాతీయ మీడియాను కూడా టీడీపీ నేతలు మేనేజ్ చేస్తున్నారు. కోటి రూపాయలతో ప్రాణం తిరిగి వస్తుందా అని అంటున్న చంద్రబాబు, టిడిపి నాయకులు 25 లక్షల పరిహారం ఎందుకు అడిగారు. పుష్కరాల్లో 30 మంది చనిపోతే కుంభమేళాలో చనిపోలేదని చంద్రబాబు హేళనగా మాట్లాడారు'' అని అన్నారు. 

''కరోనా కేసులు ఎక్కవ వచ్చాయని ఆనంద పడకూడదు అలాగని తక్కువ వచ్చాయని సంతోష పడకూడదు. కరోనా వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి'' అని సూచించారు. 

read more పోతిరెడ్డిపాడుపై రాష్ట్రం హక్కును కాపాడాలి, తండ్రి మాదిరిగానే కొడుకు: జగన్ పై బాబు సెటైర్లు

''ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని 40 హామీలను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అమలు చేశారు. మేనిఫెస్టోలో పెట్టిన 90 శాతం హామీలను సీఎం జగన్ ఏడాదిలోపే అమలు చేశారు. చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదు. చంద్రబాబు గురించి చెప్పుకొనేందుకు ఒక పథకమైన ఉందా?'' అని ప్రశ్నించారు.

''కరెంట్ చార్జీలు పెంచమని అసత్య ప్రచారం చేస్తున్నారు. వినియోగం పెరగడం వలనే కరెంట్ బిల్లులు ఎక్కువుగా వచ్చాయి. రాష్ట్రానికి ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా రైతు భరోసా, అమ్మ ఒడి వంటి కార్యక్రమాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారు. చంద్రబాబు పెట్టిన వేల కోట్ల బకాయిలను సీఎం జగన్ చెల్లిస్తున్నారు'' అని తెలిపారు.

''చంద్రబాబు మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. చంద్రబాబు హయాంలో మూడు సార్లు కరెంట్ చార్జీలు పెంచారు. చార్జీలు తగ్గించాలని ఉద్యమం చేస్తే చంద్రబాబు కాల్పులు జరిపించారు. ఆదాయం పెంచు కోవడం కోసమే ప్రజలు మీద భారం వేయకుండా భూములు అమ్మాల్సి వస్తుంది. ఇది ఒక రకంగా ఆదాయం పెంచుకొనే వనరే'' అని సజ్జల పేర్కొన్నారు.