అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ కొనసాగింది. నేటితో అటు ప్రభుత్వ, ఇటు పిటిషనర్ తరపు వాదనలు ముగిశాయి. అయితే న్యాయస్థానం మాత్రం తీర్పును ప్రకటించకుండా రిజర్వ్ చేసింది.

జీవో నంబర్ 623 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా వున్న అన్ని పంచాయితీ కార్యాలయాలకి రంగులు వేసింది ఏపీ సర్కారు. అయితే ప్రభుత్వ కార్యలయాలకు వైసిపి పార్టీ రంగులు వేశారని ఆరోపిస్తూ జీవో నంబర్ 623ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ప్రభుత్వ భవనాలపై వైసీపీ జెండా రంగులే కనిపిస్తున్నాయని పిటిషనర్ తరుపు న్యాయవాది సోమయాజులు న్యాయస్థానం ముందు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న  హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. 

ఆంధ్ర ప్రదేశ్ వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వున్న ప్రభుత్వ కార్యాలయ భవనాలను ముస్తాబు చేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో  భాగంగా గ్రామాల్లోని పంచాయితీ భవనాలకు రంగులు వేయించింది. ఇంతవరకు బాగానే వున్న ప్రభుత్వం వేయించిన రంగులు వైసిపి జెండా రంగులను పోలివుండటం వివాదానికి దారితీసింది. 

ప్రభుత్వ కార్యాలయాలను పార్టీ రంగులు వేసిన వైసిపి సర్కార్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అంతేకాకుండా ఇటీవల స్థానికి ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలోనూ ఈసీకి దీనిపై ఫిర్యాదులు అందాయి. కొందరు కోర్టులను కూడా ఆశ్రయించారు. ఇలా దాఖలయిన పిటిషన్ పై తుది విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం తాజాగా తీర్పును రిజర్వ్ చేసింది.