చంద్రబాబు కరోనావైరస్ లాంటివాడు, షరీఫ్ అంగీకరించారు: సజ్జల
టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా వైరస్ లాంటివాడని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. శాసన మండలిలో సెలెక్ట్ కమిటీ నియమిస్తున్న విషయంలో చేసిన ప్రకటనలో తప్పు జరిగిందని షరీఫ్ ఆంగీకరించారని ఆయన అన్నారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్డల రామకృష్ణా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శాసన మండలిలో సెలెక్ట్ కమిటీ ఏర్పాటుపై కూడా ఆయన మాట్లాడారు. శాసన మండలిలో సెలక్ట్ కమిటీ ఏర్పాటునకు అవకాశం లేదని ఆయన అన్నారు.
శాసన మండలిలో హై డ్రామా జరిగిన సంగతి ప్రజలంతా చూశారని,శాసన మండలిలో సెలక్ట్ కమిటీ ఏర్పాటు నిబంధనలకు విరుద్దమని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో అన్నారు. బిల్లుపై సభలో ఒటింగ్ జరగకుండా సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయకూడదని ఆయన అన్నారు.
తాను చేస్తోంది తప్పేనని ఛైర్మన్ షరీఫ్ కూడా ఒప్పుకున్నారని ఆయన అన్నారు.ఒత్తిడిలో ఛైర్మన్ తప్పు గా వ్యవహరించారని,సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఛైర్మన్ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ మినహా ఇతర పార్టీల సభ్యులు తప్పుపట్టారని సజ్జల అన్నారు.
శాసన సభలో ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉందని,వికేంద్రీకరణ బిల్లు శాసన సభలో ఆమోదం పొందిందని ఆయన చెప్పారు.మండలిని శాసన సభ రద్దు చేస్తూ తీర్మానం చేసిందని, తమ దృష్టిలో శాసనమండలి రద్దయిందని ఆయన అన్నారు. తాము చేస్తుంది రాజధాని తరలింపు కాదని, పరిపాలన వికేంద్రీకరణ మాత్రమేనని ఆయన అన్నారు.
జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారని చెప్పారు. పరిపాలన వికేంద్రీకరణకు ప్రజల మద్దతు ఉందని, వైజాగ్ వెళ్లే విషయమై ఉద్యోగుల్లో ఆనందం ఉందని ఆయన చెప్పారు. త్వరలోనే విశాఖ పట్నంలో రాజధాని కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు.
చంద్రబాబు కరోనా వైరస్ లాంటివారని, ఆయన్ను చూసి అందరూ భయపడుతున్నారని సజ్జల అన్నారు. కింది స్థాయి సిబ్బంది బాధ్యతారాహిత్యంవల్ల కొన్ని పించన్లు పోయిఉండొచ్చునని, పొరపాట్లు సరిచేసేందుకు అన్ని సచివాలయాల్లో ఏర్పాటు చేసి ఆదేశాలిచ్చామని చెప్పారు.
పించన్లు పోయినవారు వెంటనే తిరిగి సచివాలయాల్లో దరఖాస్తు చేయాలని,
దరఖాస్తులు పరిశీలించి అర్హులైతే వెంటనే పించన్లు మంజూరు చేస్తామని చెప్పారు.తన ఊరిలో వైసిపి నేతలు సభ ఎందుకు పెట్టారని అంటున్న చంద్రబాబు గతంలో పులివెందులకు వచ్చి సభ ఎందుకు పెట్టారని అడిగారు. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించారని, రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా తాము వస్తామని, ఆ అధికారం తమకు ఉందని సజ్జల చెప్పారు..