రిపబ్లిక్ టీవీలో తమ పార్టీపై వస్తున్న తప్పుడు కథనాలపై స్పందించారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన రిపబ్లిక్ టీవీలో తమపై తప్పుడు కథనాలు ప్రసారం చేశారని ఆరోపించారు.

వైసీపీలో ఎలాంటి విభేదాలు లేవని సజ్జల స్పష్టం చేశారు. జగన్ పాపులారిటీని తట్టుకోలేకే ఇలా చేస్తున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇలా ఎవరు చేస్తున్నారో అందరికీ తెలిసిందేనని చెప్పారు.

పార్టీలో సంక్షోభం, తిరుగుబాటు అంటూ తప్పుడు కథనం ప్రచురించారని.. అర్నబ్ జాతికి పట్టిన చీడ అని అందరూ చెబుతారని సజ్జల మండిపడ్డారు. రిపబ్లిక్ టీవీ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందని... దీనికి వెనుక ఎవరు ఉన్నారనేది అందరికీ తెలుసునని రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.

ఇదే సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే సీఎం జగన్ లేఖ రాశారని తెలిపారు. చంద్రబాబు అధికారంలో వున్ననప్పుడే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అంకురార్పణ పడిందని బొత్స తెలిపారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని కేంద్రమంత్రులను కలిశామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలను మూసేసిన ఘనత చంద్రబాబుదంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ రాసిన లేఖకు పూర్తిగా కట్టుబడి వున్నామని.. స్టీల్ ప్లాంట్‌పై తమ పోరాటం నిరంతరం జరుగుతుందని బొత్స పేర్కొన్నారు.

మేం ఇన్ని చేస్తుంటే మరి టీడీపీ ఏం చేస్తుందని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడైనా ఏ విషయమైనా స్పష్టంగా చెప్పారా అని మంత్రి నిలదీశారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కుకు తాము కట్టుబడి వున్నామని బొత్స వెల్లడించారు. అఖిలపక్షం బంద్ చేస్తే ప్రభుత్వం తరపున సంఘీభావం తెలిపామని గుర్తుచేశారు.