Asianet News TeluguAsianet News Telugu

గుంటనక్కలు నిద్రలేచాయి.. ఏమరపాటుగా ఉంటే వెన్నుపోట్లు, పక్కపోట్లు: సజ్జల

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సంక్షేమ సంతకం చేసి నాలుగేళ్లు అయిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

Sajjala Ramakrishna Reddy Comments YS Jagan Govt 4 years celebration ksm
Author
First Published May 30, 2023, 11:23 AM IST

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సంక్షేమ సంతకం చేసి నాలుగేళ్లు అయిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా నాలుగేళ్ల పాలనపై వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డి, నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ నాలుగేళ్ల పాలనలో చరిత్ర సృష్టించారని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చారని తెలిపారు. ఏడాదిలో ఎన్నికలు రాబోతున్నాయని.. మళ్లీ గుంటనక్కలు నిద్రలేచాయని అన్నారు. చంద్రబాబు కొత్త హామీలతో పగటి వేషాలు వేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని నిలువుదోపిడి చేయడానికి అవకాశం కావాలని చంద్రబాబు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారనేది ప్రజలకు తెలుసునని అన్నారు. 

వైఎస్సార్ మాదిరిగా చంద్రబాబు ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదని అన్నారు. టీడీపీ చంద్రబాబు పెట్టిన పార్టీ కాదని.. దొంగదెబ్బ కొట్టి, మామను చంపి తెచ్చుకున్నారని ఆరోపించారు. చంద్రబాబును మోసేందుకు ప్యాకేజ్ తీసుకున్న దత్తపుత్రుడు ఉన్నాడని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే పెద్ద యుద్దం అని చెప్పారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు పాలనను ప్రజలకు గుర్తుచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. చంద్రబాబు చెప్పుకోవడానికి ప్రజలు చేసిన మేలు ఏం లేదని విమర్శించారు. 

ఎన్నికల సమయంలో ప్రజలను భ్రమలో పెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తారని విమర్శించారు. వైసీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని.. ఏమరపాటుగా ఉంటే వెన్నుపోట్లు, పక్కపోట్లు ఉంటాయని అన్నారు. వైసీపీ శ్రేణులు ఒక్కటిగా నిలబడి.. ప్రజల ఆశలను పూర్తి చేయడానికి కృషి చేయాలని చెప్పారు. గుంట నక్కల ఎత్తులను ప్రజలకు తెలియజేయాలని కోరారు. ‘‘వై నాట్ 175’’ను నిజం చేసే దిశగా అడుగులు వేయాలని వైసీపీ శ్రేణులను కోరారు. వైసీపీకి ఉన్న ఆదరణకు జగన్ పథకాలు, ఆలోచన విధానమే కారణమని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios