తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటిని అటాచ్ చేయడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సీఐడీ అనేది స్వతంత్ర సంస్థ అని.. వారు విచారణ చేస్తున్నారని అన్నారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటిని అటాచ్ చేయడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సీఐడీ అనేది స్వతంత్ర సంస్థ అని.. వారు విచారణ చేస్తున్నారని అన్నారు. వారి విచారణను తేల్చడానికి కోర్టులు ఉన్నాయని చెప్పారు. సీఎం జగన్‌ది కక్ష సాధింపు అయితే చంద్రబాబును ఎత్తి జైలులో పడేసేవారని అన్నారు. ఏదైనా ఒక పద్దతి ప్రకారం జరుగుతుందని చెప్పారు. కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న ఇల్లు అక్రమాలకు చిరునామా అని విమర్శించారు. పైసా అద్దె చెల్లించకుండా ఆరేళ్ల నుంచి చంద్రబాబు అక్కడ ఎలా ఉంటున్నారని ప్రశ్నించారు.
అక్రమ కట్టడంలో చంద్రబాబు ఏ హోదాలో ఉంటున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఆలవెన్స్ తీసుకుంటూ.. అద్దె అగ్రిమెంట్ లేకుండా ఎలా ఉంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబుకు లింగమనేని రమేష్ ఆ ఇళ్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. లింగమనేని రమేష్ భూములకు లబ్దిచేకూర్చేందుకు క్విడ్ ప్రోకో జరిగిందని.. ఇందుకు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అందుకు ప్రతిఫలింగా లింగమనేని రమేష్ కంపెనీ నుంచి నాలుగు ఎకరాలు చౌకగా హెరిటేజ్‌కు బదలాయించారని.. ఇదంతా పెద్ద స్కామ్ అని ఆరోపించారు. ఇందుకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
అక్రమ కట్టడంలో పైసా అద్దె ఇవ్వకుండా చంద్రబాబు ఎలా ఉన్నారని.. లింగమనేని ఎలా ఉండనిచ్చారని ప్రశ్నించారు. ఒక బాధ్యత కలిగిన నాయకుడు ఇలా చేయడం కరెక్టేనా అని ప్రశ్నించారు. ఇది రాచరిక వ్యవస్థ కాదని అన్నారు. లింగమనేని రమేష్ దేశభక్తితో ప్రభుత్వానికి ఆ బిల్డింగ్ ఇచ్చారని చెప్పారని అన్నారు. అయితే ప్రభుత్వానికి ఇస్తే చంద్రబాబు అధికారం కోల్పోయిన తర్వాత ఖాళీ చేయాలని లేదా ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుందని.. ఆ పని చంద్రబాబు చేయలేదని అన్నారు. ప్రజల సోమ్ము అడ్డంగా వాడుకోవచ్చే బరితెగింపు చంద్రబాబులో కినిపిస్తోందని విమర్శించారు.
అమరావతి లేదని స్కామ్ లేదంటే ఎలా అని ప్రశ్నించారు. అమరావతి స్కామ్‌లో రైతులు మునిగిపోయారని ఆరోపించారు. తదుపరి చర్యలేమిటనేది సీఐడీ చూసుకుంటుందని చెప్పారు. దేనికైనా ఒక పద్దతి ఉంటుందన్నారు. ఇలాంటివి చాలా బయటకు వస్తాయని అన్నారు. సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారని చెప్పారు.
సీఎం జగన్ వెనకబడిన వర్గాల అభివృద్ది దిశగా పనిచేస్తున్నారని చెప్పారు. టీడీపీ, పవన్ కల్యాణ్, వామపక్ష పార్టీలు సంపన్నుల వైపు నిలబడుతున్నాయని విమర్శించారు. చంద్రబాబుకు పవన్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్ రాజకీయ నిర్ణయాలు చంద్రబాబుకు రాజకీయంగా ఉరితాడు లాంటివని అన్నారు. అందుకే విపక్షాలు అన్ని తోడేళ్ల మందలా ఏకమై దాడి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
