అమలాపురంలో చోటుచేసుకున్న విధ్వంసంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన వెనక ఉన్న ఎవరూ తప్పించుకోలేరని చెప్పారు. చాలా కఠినంగా వ్యవహరించనున్నట్టుగా తెలిపారు. 

అమలాపురంలో చోటుచేసుకున్న విధ్వంసంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన వెనక ఉన్న ఎవరూ తప్పించుకోలేరని చెప్పారు. చాలా కఠినంగా వ్యవహరించనున్నట్టుగా తెలిపారు. అంబేడ్కర్ పేరు పెట్టాలని అన్ని వర్గాలు కోరాయని, ప్రధాన పార్టీలన్నీ మద్దతు పలికాయని చెప్పారు. కొన్ని శక్తులు నిరసకారులను రెచ్చగొట్టాయని తెలిపారు. పోలీసులు సంయమనంతో వ్యవహరించారని చెప్పారు. ఇది ఓట్ల కోసం రాజకీయంగా చేసిన కుట్ర అని ఆరోపించారు. అటువంటి వారిని రాజకీయంగా ఎలా ఎదుర్కొవాలో కూడా చూస్తామని చెప్పారు. 

పెట్రోల్ బాంబులు కూడా జరిగినట్టుగా చెబుతున్నారని అన్నారు. అంబేడ్కర్ ఎస్సీ నాయకుడని అనుకుంటే తాము ఏమి చేయలేమని అన్నారు. ఈ తరహా శక్తుల్ని ఎలా హ్యాండిల్‌ చేయాలి ప్రభుత్వానికి తెలుసని వ్యాఖ్యానించారు.రాష్ట్ర ప్రభుత్వం సంయమనం పాటించడంతోనే ఈ కుట్రను అదుపులోకి తెచ్చామని చెప్పారు. 

పచ్చని కోనసీమలో చిచ్చుపెట్టారు- మంత్రి బొత్స
అమలాపురం ఘటన దురదృష్టకరమని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ ఘటన వెనక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టారని మండిపడ్డారు. ఈ అల్లర్ల వెనక ఎవరున్నారో అందరికీ తెలుసన్నారు. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంత్రి, ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టడం హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం విపక్షాల కుట్రను ప్రజలు గమనించాలని కోరారు. రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఆలోచన అని అన్నారు. 

అంబేద్కర్ ఒక‌కులానికో, ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ సృష్టి కర్త అని.. ఈరోజు మనం స్వేచ్చగా జీవించడానికి అంబేద్కర్ రాజ్యాంగమే కారణమని గుర్తుచేశారు. అటువంటి మహానుభావుడు పేరు పెడితే ఎందుకు అల్లర్లకి పాల్పడ్డారని ప్రశ్నించారు. ఇది మంచి సంప్రదాయం‌కాదని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ప్రమేయమున్నవారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.