ఆంధ్రప్రదేశ్ లో గత కొంతకాలంగా  విగ్రహాల ధ్వంసాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.  కాగా.. ఈ వరస ఘటనలపై బీజేపీ నాయకురాలు సాదినేని యామిని ఆవేదన వ్యక్తం చేశారు. విగ్రహాలు ధ్వంసంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడుతూ...జగన్ సర్కర్‌కు శాపాలు పెట్టారు. మొన్నటికి మొన్న అంతర్వేది రథం దగ్ధమవగా....నేడు రామతీర్థంలో రాముల వారి తలను నరకడం చూస్తుంటే అసలు భారత దేశంలో ఉన్నామా అని అనిపిస్తోందని అన్నారు. 

దేవలయాల్లో విగ్రహాల ధ్వంసంతో హిందువుల గుండె రగులుతోందని తెలిపారు.  హిందువులు కారుస్తున్న ప్రతీ కన్నీటి చుక్కా ముష్కరులను అంతం చేసే త్రిశూలంలా మారుతుందని స్పష్టం చేశారు. విగ్రహాలు ధ్వంసం అవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని కన్నీరుమున్నీరయ్యారు. హిందూ ధర్మాన్ని కాపాడుకునేందుకు ప్రతీఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంతకుమించి దారుణాలు చూసే శక్తి లేదన్నారు. రాష్ట్రంలో హిందూ దేవుళ్లకు తీవ్రమైన అవమానం చేస్తున్నారని...అవమానం జరిగిన చోటే మహాసంకల్పానికి బీజం పడాలని యామిని కోరారు.