విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో షాక్ తగిలింది. టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని పార్టీకి రాజీనామా చేశారు. ఆమె ఈ నెల 10వ తేదీన బిజెపిలో చేరే అవకాశాలున్నాయి. తన రాజీనామా లేఖను ఆమె చంద్రబాబుకు పంపించారు. టీడీపీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని, ఇబ్బంది ఉందని ఆమె చంద్రబాబుకు రాసిన లేఖలో అన్నారు.

సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత తెలుగుదేశం పార్టీకి పలువురు నేతలు రాజీనామా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, సాధినేని యామిని కూడా రాజీనామా చేశారు. జూపల్లి ప్రభాకర్ రావు టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం కావాలని చూస్తున్న బిజెపి టీడీపీ, ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది. పలువురు టీడీపీ నాయకులు ఇంకా బిజెపి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కూడా బిజెపి వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీని ఎదుర్కోవడంలో సాధినేని యామిని కీలక పాత్ర పోషించారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీపై విమర్శలు కురిపిస్తూ వచ్చారు. గత కొంత కాలంగా మౌనం వహించారు.