భూ దందాలపై సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ సాక్షాత్తు దేవుడి భూముల్లోనే కుంభకోణం జరిగిందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు

మూడున్నర సంవత్సరాల కాలంలో టీడీపీ చేసిన భూ దందాలపై సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. హై కోర్టు ఆదేశాల మేరకు సదావర్తి భూముల వేలం పాట సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేలంలో సదావర్తి భూములు రూ.60కోట్లకు అమ్ముడుపోయాయి. దీనిపై వైసీపీ ఎంపీ మీడియాతో మాట్లాడారు.

సాక్షాత్తు దేవుడి భూముల్లోనే కుంభకోణం జరిగిందని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. సదావర్తి భూములను అమ్ముకోవాల్సిన అవసరం ఏందుకు వచ్చిందని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో ప్రకటనలు ఇచ్చి వేలం నిర్వహించాలని హైకోర్టు ఆదేశింగా.. ప్రకటనలు ఇవ్వకుండా వేలం నిర్వహించారని ఎంపీ మండిపడ్డారు. తూతూ మంత్రంగా వేలం పాట నిర్వహించారన్నారు.

వేలం పాటలో కూడా చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందన్నారు. చంద్రబాబు చేసిన భూకుంభ కోణాల్లో సదావర్తి మచ్చు తునకని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మూడు రెట్లు లాభం వచ్చేలా వేలం జరిగిందన్నారు. భూముల దోపిడి జరిగిందనడానికి నిన్నటి వేలమే నిదర్శణమన్నారు. చంద్రబాబు సర్కార్ దేవుడి భూములకు రక్షకులా.. భక్షకులా అని ప్రశ్నించారు.

భూ బాధితులందరికీ తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఎస్సీ, మైనార్టీ పేదల భూములను ప్రభుత్వం లాక్కొందని ఆరోపించారు. ఇకనైనా ప్రజలు చంద్రబాబు చేస్తున్న భూ దోపిడిని గుర్తించాలన్నారు.