రూ. 2.79 కోట్ల ఎంపి నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.

నెల్లూరు జిల్లాలోని పిఆర్ కండ్రిగలో విఖ్యాత క్రికెటర్ సచిన్ తెండూల్కర్ సందడి చేసాడు. రాజ్యసభ సభ్యుని హోదాలో సచిన్ పుట్టంరాజు వారి కండ్రిగను దత్తత తీసుకున్నారు. గతంలో ఒకసారి పై గ్రామాన్ని సందర్శించిన సచిన్ గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామస్తులు, అధికారులతో చర్చించారు. అప్పట్లో నిర్ణయించిన పనుల పురోగతిని చూసేందుకు మళ్ళీ బుధవారం సచిన్ గ్రామానికి వచ్చారు.

 రూ. 2.79 కోట్ల ఎంపి నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అదే సందర్భంగా యువతకు క్రికెట్ కిట్లు పంపిణీ చేసారు. అనంతరం, గ్రామంలోని మహేశ్ అనే యువకుని ఇంట్లో తేనీరు సేవించారు. అదే సందర్భంలో జయమ్మ అనే గ్రామస్తురాలితో అభివృద్ధి కార్యక్రమాలపై మట్లాడారు.

జిల్లాలోని గొల్లపల్లి అభివృద్ధి కోసం ఎంపి నిధుల నుండి రూ. 90 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పిఆర్ కండ్రిగ అభివృద్ధికి తాను పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. తాను దత్తత తీసుకున్న గ్రామం రెండేళ్ళలోనే బాగా మారినందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే మళ్ళీ గ్రామానికి వస్తానని కూడా చెప్పటంతో గ్రామస్తుల్లో ఆనందం వెల్లివిరిసింది.