విజయవాడ: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి షబానా ఖాతూన్ విజయం సాధించడం ఖాయమని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన విజయవాడ పశ్చిమలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడం తథ్యమన్నారు. 

విజయవాడలో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారని, నియోజకవర్గంలో ఆయన చేసే అభివృద్ధే ఆయన కుమార్తె షబానా విజయానికి దోహదపడుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దివంగత సీఎం ఎన్టీఆర్‌ ఆ తర్వాత చంద్రబాబు నాయులు మాత్రమే రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించారని తెలిపారు. 

అలాంటి వ్యక్తిపై ప్రధాని నరేంద్రమోదీ కక్ష సాధిస్తున్నారంటూ మండిపడ్డారు. గోద్రా అల్లర్లపై ప్రశ్నించినందుకే చంద్రబాబుపై మోదీ కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. అవినీతిపరుడు జగన్‌తో కలిసి చీకటి రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ ప్రధాని మోదీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు.