విశాఖపట్టణం: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆయనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. విశాఖపట్టణం మేయర్ గా....అనకాపల్లి ఎంపీగా పాలనలో ఆయనది ఓ ప్రత్యేక ముద్ర. రాజకీయాల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరు ఆయన. ఆయనే సబ్బం హరి. విశాఖపట్టణం మేయర్ గా  అనకాపల్లి ఎంపీగా పనిచేసిన సబ్బం హరి రాష్ట్ర విభజన తర్వాత స్ధబ్ధుగా ఉన్నారు.

 ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో సబ్బం హరి రాజకీయ రీ ఎంట్రీ ఉండబోతుందని ప్రచారం జరుగుతుంది. అయితే సబ్బం హరి ఏ పార్టీలో చేరబోతున్నారు.....వైసీపీలో చేరబోతున్నారా....జనసేనకు జై కొడతారా....సైకిలెక్కుతారా...అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. గత కొంతకాలంగా రాజకీయాల్లో స్తబ్దుగా ఉన్నసబ్బం హరి తొందర్లోనే రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నారు అనేది ప్రచారం జరుగుతుంది. డిసెంబర్ లేదా జనవరి నెలలో పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం.  

మాజీఎంపీ సబ్బం హరి స్వతహాగా కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. కాంగ్రెస్ పార్టీ ఎనలేని అభిమానం. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీచేసిన ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ను ఓడించి రికార్డు సృష్టించారు. రాజకీయాల్లో సందర్భోచితంగా మాట్లాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది సబ్బం హరి అనే అంటారు. రాజకీయాల్లో విలువలు కలిగిన వ్యక్తిగా కూడా సబ్బం హరిని చెప్తుంటారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో విభజనకు వ్యతిరేకంగా పోరాడారు. అధిష్టానాన్ని సైతం పట్టించుకోలేదు. రాష్ట్రాన్ని విభజించొద్దు అంటూ అధిష్టానం దగ్గర తన అభిప్రాయాలను బాహాటంగా చెప్పిన వ్యక్తి. అయితే రాష్ట్ర విభజన జరిగిన తీరు నచ్చకపోవడంతో సబ్బం హరి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. 

వైఎస్ మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు. వైఎస్ జగన్ చేపట్టిన ఓదార్పుయాత్రలో సైతం పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి మద్దతుగా నిలిచారు. జగన్ కు రాజకీయ వ్యవహారాలపై సూచనలు ఇచ్చేవారు. తనకు అనకాపల్లి ఎంపీ నుంచి పోటీ చెయ్యమంటారా....లేదా విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలా అన్నదానిపై జగన్ క్లారిటీ ఇవ్వకపోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. 

అయితే ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ తరపున విశాఖపట్టణం ఎంపీ అభ్యర్థిగా పోటీ చెయ్యాలని కోరడంతో నామినేషన్ సైతం వేశారు. 2014 ఎన్నికల్లో విశాఖపట్టణం ఎంపీ అభ్యర్థిగా వైఎస్ విజయమ్మను బరిలోకి దించాలన్నజగన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. విజయమ్మ కచ్చితంగా ఓడిపోతారని చెప్పారు. అయినా జగన్ పెడచెవిన పెట్టడంతో తాను బీజేపీ టీడీపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కంభపాటి రామ్మోహన్ రావుకు మద్దతిస్తున్నట్లు ప్రకటించేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ ఓటమి చవిచూశారు. 

2014 ఎన్నికల అనంతరం సబ్బం హరి రాజకీయాలకు దూరంగా ఉన్నారు..తన భార్య క్యాన్సర్ బారినపడటంతో ఆమె కోసం రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేదు. అయితే ఆమె కాలం చెయ్యడంతో ప్రజాజీవితంలోకి మళ్లీ అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో అధికార తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. 

అధికార తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందంటూ ఇటీవలే కితాబునిచ్చారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భూసేకరణ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు, భోగాపురం విమానాశ్రయం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చూస్తుంటే అద్భుతంగా ఉందంటూ మెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన లోటు బడ్జెట్ సమయాల్లో కూడా చంద్రబాబు నాయుడు నిర్ణయాత్మక పాలన అందిస్తున్నారంటూ కొనియాడుతూనే ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయ్యారంటూ విమర్శించారు. 

మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సైతం ప్రశంసలతో ముంచెత్తారు. 2014 ఎన్నికల ఫలితాలను చూస్తే ఆశ్చర్యమేసిందని తన మనసులో మాట చెప్పారు. అయితే అధికార పార్టీ చేస్తున్న వైఫల్యాలను ఎండగట్టడంలో జగన్ వైఫల్యం చెందుతున్నారని చిన్నచురక వేశారు. అంతేకాదు జగన్ గ్రాఫ్ 2014 కంటే ఇప్పుడు కాస్త తగ్గిందన్నారు...అయినా పార్టీకి మంచి భవిష్యత్ ఉందంటూ వెనకేసుకొచ్చారు. 

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనపార్టీలోకి వెళ్తా రా అన్నదానిమీద క్లారిటీ ఇవ్వడం లేదు. పవన్ కళ్యాణ్ కు రాజకీయాల్లో పరిపక్వత లేదని విమర్శిస్తున్నారు. కాకినాడ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం చూసి కేంద్రాన్ని నిలదీసే వ్యక్తి దొరికారని సంతోషపడ్డానని అయితే ఆ తర్వాత పవన్ స్పీచ్ లు చూస్తుంటే అవగాహన రాహిత్యం చాలా కొట్టొచ్చినట్లు కనబడుతుందన్నారు. 

 ఏ పార్టీలో చేరతారనేది మాజీఎంపీ సబ్బం హరి క్లారిటీ ఇవ్వడం లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తున్నారని చంద్రబాబును ప్రశంసిస్తున్న సబ్బం సైకిలెక్కుతారా లేక వైఎస్ కుటుంబంపై ఉన్న అనుబంధంతో వైసీపీలోకి వెళ్తారా అన్నది తెలియాల్సి ఉంది. లేకపోతే ఈ రెండు కాదని జనసేనకు జైకొడతారా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ప్రశ్నలకు చిక్కుముడి విడాలంటే డిసెంబర్ లేదా జనవరి నెల వరకు వేచి చూడాల్సిందే.