లైంగిక వేధింపుల ఆరోపణలు: అనకాపల్లి జూడో కోచ్ శ్యామ్యూల్ రాజుపై వేటు
మహిళా క్రీడాకరులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కోచ్ శ్యామ్యూల్ రాజును విధుల నుండి తప్పించారు.
అమరావతి: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జూడో కోచ్ శ్యామ్యూల్ రాజును తొలగిస్తూ శాప్ ఎండీ హర్షవర్ధన్ ఆదివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. అనకాపల్లి జిల్లాలో శ్యామ్యూల్ రాజు జోడో కోచ్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
జూడో కోచ్ శ్యామ్యూల్ రాజు మద్యం మత్తులో తమపై లైంగికంగా వేధింపులకు పాల్పడినట్టుగా విద్యార్ధినులు ఆరోపించారు. మూడు రాత్రులు గడపాలని తమను లైంగికంగా వేధింపులకు పాల్పడినట్టుగా విద్యార్ధినులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు సహకరిస్తే క్రీడల్లో మీ భవిష్యత్తు బాగుంటుంది.. లేకపోతే నాశనం చేస్తానని తమను ఇబ్బంది పెట్టినట్టుగా బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
చెన్నైలో జరిగే జాతీయ జూడో పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తూ విజయవాడలో ఆగిన జూడో విద్యార్ధినులపై శ్యామ్యూల్ రాజు అసభ్యంగా ప్రవర్తించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తనకు సహకరించకపోతే ఇబ్బందిపెడతానని కూడా జూడో కోచ్ వార్నింగ్ ఇచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శ్యామ్యూల్ రాజును విధుల నుండి తప్పించారు.
ఔట్ సోర్సింగ్ పద్దతిలో జూడో కోచ్ గా శ్యామ్యూల్ రాజు విధులు నిర్వహిస్తున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో శ్యామ్యూల్ రాజును విధుల నుండి తప్పిస్తున్నట్టుగా శాప్ ఎండీ హర్షవర్ధన్ ఉత్తర్వులు జారీ చేశారు.