రష్యా బాంబుల మోతతో ఉక్రెయిన్ లో యుద్దవాతావరణం నెలకొనగా అక్కడ బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయంభయంగా బ్రతుకుతున్న భారతీయులను కాపాాడాలంటూ దేశ విదేశాంగమంత్రికి టిడిపి చీఫ్ చంద్రబాబు లేఖ రాసారు. 

అమరావతి: రష్యా (russia) సైనిక చర్యకు దిగడంతో ఒక్కసారిగా ఉక్రెయిన్ (ukraine) లో అలజడి రేగి భయానక వాతావరణం ఏర్పడింది. ప్రశాంతంగా వుండే ఉక్రెయిన్ గత బుధవారం అర్థరాత్రి నుండి బాంబుల మోతతో దద్దరిల్లిపోతోంది. దీంతో ఉక్రెయిన్ ప్రజలతో పాటు విద్యా, ఉపాధి నిమిత్తం వెళ్లిన భారతీయులు కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ నుండి భారతీయులను తీసుకురావాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (jayshankar) కు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu) లేఖ రాసారు. 

''కరోనా (corona) సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తీసుకురావడంలో మీరు చూపిన చొరవ మరువలేనిది. ఇప్పుడు కూడా అలాగే ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను కూడా సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కోరుతున్నాను. ఈ క్రమంలో ఉక్రెయిన్ అలజడి రేగడంతో భారతప్రజలు ముఖ్యంగా తెలుగుప్రజలు ఎంతలా ఇబ్బందిపడుతున్నారో ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకువస్తున్నాను'' అని చంద్రబాబు పేర్కొన్నారు.

''రష్యా దాడి చేస్తున్న ఉక్రెయిన్ దేశంలో దాదాపు 4000 మంది తెలుగు విద్యార్థులు, ఉద్యోగాల కోసం వచ్చినవారు చిక్కుకొని ఉన్నారు. ఈ దేశంలో యుద్దవాతావరణం నెలకొనడంతో ఇంట్లోంచి బయటకు రాలేని పరిస్థితి వుంది. దీంతో ఏటీఎంలలో నగదు తీసుకునేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. కనీసం తినేందుకు తిండి లేకుండా భారత ప్రజల అనేక ఇబ్బందులు పడుతున్నారు'' అని విదేశాంగమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 

''ఉక్రెయిన్ లోని ఒడెస్సా, కీవ్ పట్టణాలలో యూనివర్శిటీలు, కార్యాలయాలు మూసివేయడంతో తెలుగు ప్రజలు అత్యంత దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది తెలుగు ప్రజలు తోటి భారతీయులతో కలిసి కీవ్ విమానాశ్రయంలో విమానం ఎక్కేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రస్తుతం వారు ఇండియన్ ఎంబసీ ఏర్పాటు చేసిన ఒక స్కూల్ లో తలదాచుకుంటున్నారు'' అని తెలిపారు. 

''ప్రస్తుతం ఉక్రెయిన్ లో భయానక పరిస్థితులు వుండటంతో అక్కడ చిక్కుకున్న తమవారి యోగక్షేమాలు తెలియక కుటుంబసభ్యులు చాలా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు ప్రజలను స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చేసే ఈ సహాయం వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది'' అని మంత్రి జయశంకర్ కు రాసిన లేఖలో చంద్రబాబు పేర్కోన్నారు. 

ఇక ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఉక్రెయిన్‌లో ఉన్న ఏపీ వాసులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాసారు. ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఏపీ వాసులు తిరిగి రాష్ట్రానికి రావడానికి సహాయం కోరుతున్నారని... రాష్ట్ర ప్రభుత్వం నిత్యం కేంద్ర విదేశాంగ శాఖతో టచ్‌లో ఉందని జగన్ పేర్కొన్నారు. వాళ్లని వెనక్కి తీసుకురావడంలో కావాల్సిన సహకారం కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌, ఇక్కడి సీఎంవో అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి లేఖలో చెప్పారు. ఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులతో ప్రభుత్వం టచ్‌లో ఉందని.. కేంద్రం సూచించిన మేరకు వారంతా వెనక్కి రావడానికి తమ వంతు సహకారం అందిస్తున్నామని సీఎం జగన్‌ కేంద్ర మంత్రి జయశంకర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు.