బస్సులో పాత సూట్‌కేసు, తెరిచిచూస్తే బయటపడ్డ ఆభరణాలు .. నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్
ప్రకాశం జిల్లా అద్దంకి ఆర్టీసీ బస్ డ్రైవర్ తన నిజాయితీ చాటుకున్నారు. బస్సులో దొరికిన సూట్‌కేసును బాధితుడికి అందించారు. అందులో రూ,5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు వున్నాయి.

రోడ్డు మీద పది రూపాయల నోటు కనిపిస్తేనే .. ఎవరూ చూడకుండా జేబులో వేసుకునే వాళ్లు వున్న రోజుల్లో ఓ ఆర్టీసీ డ్రైవర్ నిజాయితీగా తనకు దొరికిన సూట్‌కేసును పోలీసులకు అప్పగించాడు. అందులో రూ.5 లక్షల విలువైన ఆభరణాలు వున్నా ఏ మాత్రం ఆశపడలేదు. వివరాల్లోకి వెళితే.. అద్దంకి మండలం కలవకూరు గ్రామానికి చెందిన కుంచాల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి బేల్దారి మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఇతను తెలంగాణలోని కొత్తగూడెంలో నివసిస్తున్నాడు. మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం వచ్చాడు. అనంతరం అక్కడ పనులు ముగించుకుని బుధవారం కొత్తగూడెం బయల్దేరాడు. అద్దంకి నుంచి విజయవాడకు ప్రయాణించిన ఆయన చేతిలోని సూట్‌కేసును బస్సులోనే మరిచిపోయి, దిగి వెళ్లిపోయారు.
అయితే సాయంత్రం ఆర్టీసీ బస్సు అద్దంకి డిపోకు తిరిగి చేరుకుంది. ఈ క్రమంలో ఆ సూట్‌కేసును బస్సు డ్రైవర్ ఎంఆర్ఎస్ రెడ్డి గుర్తించాడు. పాత సూట్‌కేసు కావడంతో చెత్తలో వేద్దామనుకున్నాని, అయితే గ్యారేజ్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది సమక్షంలో దానిని తెరవగా అందులో బంగారు, వెండి ఆభరణాలు, విలువైన పత్రాలు వున్నాయని ఆయన మీడియాతో అన్నారు. వెంటనే ఈ విషయాన్ని డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆభరణాల సూట్‌కేసులోని రశీదును పరిశీలించి బాధితుడికి సమాచారం అందించారు.
అప్పటికే సూట్‌కేసు పొగొట్టుకుని కంగారులో వున్న బాధితుడు వెంకటేశ్వర్లకు సమాచారం అందడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కలవకూరులో నివసించే సోదరిని అద్దంకి ఆర్టీసీ డిపో అధికారుల వద్దకు పంపించారు. వారు సూట్‌కేసును, అందులోని వస్తువులను ఆమెకు అప్పగించారు. నిజాయితీగా వ్యవహరించిన డ్రైవర్ ఎంఆర్ఎస్ రెడ్డిని అధికారులు అభినందించారు.