విజయవాడ బస్ యాక్సిడెంట్ కు కారణమదే... ఆర్టిసి ఎండీ చేతికి నివేదిక

విజయవాడ ఆర్టిసి బస్సు ప్రమాదానికి గల కారణమేంటో ఆర్టిసి అధికారులు గుర్తించారు. మఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో ఈ ప్రమాదంపై విచారణ జరిపిన ఆర్టిసి అధికారులు నివేదిక తయారుచేసారు. 

RTC report on Vijayawada Bus Accident AKP

విజయవాడ : విజయవాడ బస్సు ప్రమాద ఘటన మానవ తప్పిదమేనని ఆంధ్ర ప్రదేశ్ ఆర్టిసి అధికారులు తేల్చారు. బస్సులో ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తలేదని...  గేర్ స్ట్రక్, బ్రేక్ ఫెయిల్ అయ్యాయంటూ జరుగుతున్నదంతా తప్పుడు సమాచారమని అధికారులు చెబుతున్నారు. రివర్స్ గేర్ వేయడానికి బదులు పొరపాటున ముందుకు వెళ్ళే గేర్ వేయడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. గేర్ మారిందోలేదో చూసుకోకుండానే బస్సును తీసేందుకు డ్రైవర్ ప్రయత్నించినట్లు... అతడి తప్పిదమే ప్రమాదానికి కారణమని ఆర్టిసి టెక్నికల్ టీమ్ తేల్చింది. 

విజయవాడ బస్సు ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపిన ఆర్టిసి అధికారులు నివేదికను సిద్దం చేసారు. ఈ నివేదికపై ఆర్టిసి ఎండీ ద్వారకాతిరుమలరావు ఉన్నతాధికారులతో చర్చిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పై చర్యలు తీసుకోన్నట్లు సమాచారం.  

Read More  విజయవాడ బస్సు భీభత్సం... ఎంత భయానకంగా జరిగిందో చూడండి.. (వీడియో)

ఇక విజయవాడ బస్ యాక్సిడెంట్ మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అలాగే బస్సు ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆర్టిసి అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో ఆర్టిసి ఎండి ద్వారకాతిరుమలరావు ఓ బృందాన్ని విచారణకోసం ఏర్పాటుచేసారు. టెక్నికల్ విషయాలు, ప్రత్యక్ష సాక్షులు,  డ్రైవర్ నుండి వివరాలు సేకరించిన ఈ బృందం నివేదికను తయారుచేసి ఎండీకి అప్పగించింది. 

ప్రమాదం జరిగిందిలా :

విజయవాడ నుండి గుంటూరు వెళ్ళేందుకు ఓ లగ్జరీ బస్సు డిపొ నుండి నెహ్రూ బస్టాండ్ కు చేరుకుంది. ప్లాట్ ఫారం పై నిలిపిన బస్సును డ్రైవర్ వెనక్కి తీయబోయాడు. ఇందుకోసం రివర్స్ గేర్ వేయకుండా ముందుకు వెళ్లే గేర్ వేసి ఒక్కసారిగా రేస్ చేసాడు. ఇంకేముందు బస్సు అమాంతం ముందుకు దూసుకెళ్లింది. ప్రయాణికులపైకి దూసుకెళ్లిన బస్సు ముగ్గురి ప్రాణాలను బలితీసుకోవడమే కాదు మరికొందరిని గాయాలపాలు చేసింది. ఈ ప్రమాదంతో ఓ కండక్టర్, మహిళా ప్రయాణికురాలితో పాటు చిన్నారి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios