పుణ్యానికి పోతే.. పాపం ఎదురైనట్లు ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే సర్దిచెబుదామని వెళ్లిన పాపానికి ఓ వ్యక్తి తన ప్రాణాల్ని పొగొట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే... కడప జిల్లా ప్రొద్దుటూరు వైఎంఆర్‌ కాలనీలో నివసిస్తున్న కొమ్మిరెడ్డి శివశంకర్‌రెడ్డి జమ్మలమడుగు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నాడు.

అతనికి భార్య ఉమామహేశ్వరి, వినోద్‌కుమార్‌ అనే కుమారుడు, హిమజ అనే కుమార్తె ఉన్నారు. కుమారుడు వినోద్ లండన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న వైఎంఆర్‌ కాలనీలోని అరవిందనగర్‌లోని ఇంట్లో సురేంద్రాచారి అనే వ్యక్తి చెక్క పని చేస్తున్నాడు.

ఆ సమమంలో పక్కనే ఉన్న పసుపుల సుబ్బరాయుడుకు చెందిన కుక్క అతన్ని చూసి మొరగింది. దీంతో సురేంద్రాచారి రాయి తీసుకొని కుక్కపై విసిరగా అది సుబ్బరాయుడు కుటుంబసభ్యులకు తగిలింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత కుటుంబం సురేంద్రాచారిపై వాగ్వాదానికి దిగింది.

అప్పటికి గొడవ సర్దుమణిగినా తిరిగి రాత్రి మరోసారి సురేంద్రాచారి, సుబ్బరాయుడు కుటుంబ సభ్యులు గొడవ పడ్డారు. ఇది తారాస్థాయికి చేరడంంతో వారి ఇంటి సమీపంలో ఉన్న శివశంకర్‌రెడ్డి సర్దిచెప్పడానికి వెళ్లాడు. ఈ క్రమంలో ఒక వ్యక్తి కట్టె తీసుకొని శివశంకర్‌రెడ్డి తలపై బలంగా కొట్టగా అతను కుప్పకూలి పోయాడు.

దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే శివశంకర్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.