కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజ్ లో రూ.20 లక్షల డబ్బు మాయమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీ బీరువాలోనుండి సొత్త మాయమైన ఘటనపై గత నెల 29న కాకినాడ టూటౌన్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.  

గత నెల 17న రంగరాయ వైద్య కళాశాలలోని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ యూనిట్‌లోని ఓ బీరువా నుంచి రూ. 20 లక్షల సొత్తు చోరీకి గురైంది. సంబంధిత సీనియర్‌ అసిస్టెంట్‌ ఆ డబ్బును బీరువాలో భద్రపరిచానని చెబుతున్నారు. ఘటన జరిగిన తరువాత 13 రోజులకు సీనియర్‌ అసిస్టెంట్‌ వెంకటేశ్వరరావు పేరుతో పోలీసులకు ఫిర్యాదు అందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై కాకినాడ టూ టౌన్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.  

రంగరాయ వైద్య కళాశాలలో కొత్తగా సీటు పొందిన120 మందికి పైగా విద్యార్థులు డిసెంబర్ 16వరకు కాలేజీలో చేరారు. అయితే కాలేజీలో చేరే అడ్మిషన్‌ ఫీజును నేరుగా తనకివ్వాలని, తానే డీడీ తీస్తానని చెప్పి సీనియర్‌ అసిస్టెంట్‌ ఒకరు చాలామంది నుంచి రూ. 24 వేల చొప్పున వసూలు చేశారు. 

అలా వసూలు చేసిన ఆ సొత్తు విలువ రూ.20 లక్షల పైచిలుకు. అయితే బ్యాంకు నిబంధనలను అనుసరించి రూ. 24 వేల విలువైన డీడీ తీయాలంటే విద్యార్థి తన ఖాతా నుంచి తన సంతకంతో డీడీ సొమ్ము బ్యాంకుకు చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా డబ్బు వసూలు చేయడం గమనార్హం. ఇదే అనుమానాలకు తావిస్తోంది. 

అదలా ఉంటే.. తాను విద్యార్థుల నుంచి రూ. 24 వేల చొప్పన వసూలు చేశానని చెబుతున్న సీనియర్‌ అసిస్టెంట్‌ ఆ డబ్బును ఎవరో కుట్ర పూరితంగా దోచేశారని అంటున్నారు. ప్రిన్సిపాల్‌ మాత్రం ఆ డబ్బు సీనియర్‌ అసిస్టెంట్‌ పర్సనల్ డబ్బు అంటున్నారు. పరస్పర విరుద్ధంగా వీరు చెబుతున్న మాటలతో డౌట్స్ వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన సొమ్మే పోయిందా? దానికి పర్సనల్‌ కలర్‌ ఇస్తున్నారా? వంటి అంశాలు విచారణలో తేలాల్సి ఉంది.