తిన్నింటి వాసాలను లెక్కపెట్టడం అంటే ఇదే నేమో. తనకు మంచి ఉద్యోగాన్నిచ్చి, సమాచంలో మంచి హోదా కల్పించిన బ్యాంకునే లూటీ  చేశాడో ప్రబుద్దుడు. చివరకు అతడి మోసం బైటపడి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు లో గల ఎస్‌బీఐ బ్యంకులో చోటుచేసుకుంది. 

జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణం ప్రకాష్‌నగర్‌ లో నివాసముండే గురుమోహన్‌రెడ్డి పోరుమామిళ్ల రంగసముద్రం ఎస్‌బీఐ బ్యాంకు లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇతడు షేర్ మార్కెట్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేవాడు.  ఇందులో బైట అప్పులు తీసుకుని, ఇంట్లో వాళ్ల నుండి తీసుకుని, తన సంపాదన ఇలా దొరికిన ప్రతి పైసా పెట్టేవాడు. అయితే ఇందులో ఇతడు తీవ్రంగా నష్టపోయాడు.

దీంతో ఇతడిపై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలో తన కళ్లముందే కనిపించే బ్యంకు డబ్బుపై ఇతడి కన్ను పడింది. దీంతో బ్యాంక్‌ను, బ్యాంకు ఖాతాదారులను మోసం చేయాలని పథకం వేశాడు. 

బ్యాంకు ఖాతాదారులకు చెందిన దాదాపు కోటి విలువ చేసే నగదు, బంగారు ఆభరణాలను బ్యాంకులోని ఉన్నతాధికారులకు తెలియకుండా అపహరించాడు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు కనిపించకపోవడంతో బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ డబ్బు మాయమైనప్పటినుండి క్యాషియర్ కూడా కనిపించక పోవడంతో పోలీసులు ఇతడిపై అనుమానంతో గాలింపు మొదలుపెట్టారు.

పరారీలో ఉన్న కాషియర్ గురుమోహన్‌రెడ్డితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కడప ఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి దాదాపు రూ.1,08,30,000 కోట్ల నగదు, నగలను స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండుకు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.