సెకండ్ సిలిండర్ తీసుకుంటే 'ఆర్ఆర్ఆర్' టికెట్లు ఉచితం... గ్యాస్ ఏజెన్సీ బంపర్ ఆఫర్.. ఎక్కడంటే...
సెకండ్ సిలిండర్ తీసుకుంటే త్రిబుల్ ఆర్ మూవీ టికెట్స్ ఉచితంగా ఇస్తామంటూ గుంటూరులో ఓ గ్యాస్ ఏజెన్సీ క్రేజీ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు బ్యానర్లు ముద్రించి ప్రచారం చేసింది. ఇది ప్రకటించిన కాసేపటికే మూడు సిలిండర్లు బుక్కయానని వారు చెప్పారు.
గుంటూరు : తెలుగు రాష్ట్రాల్లో RRR మేనియా మరింత పెరిగింది. Rajamouli దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 25న రిలీజ్ అవుతోంది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ క్రేజ్ ను సొమ్ము చేసుకునేందుకు గుంటూరు జిల్లాలో ఓ Gas Agencyవినూత్న ఆఫర్ ప్రకటించింది. దుగ్గిరాలలోని హెచ్.పి కంపెనీ గ్యాస్ డీలర్ ఈ ఆఫర్ తీసుకువచ్చారు. సింగిల్ సిలిండర్ వినియోగదారులు రెండో సిలిండర్ తీసుకుంటే RRR ticketsఉచితంగా అందిస్తామని తమ కార్యాలయం వద్ద బ్యానర్ ఏర్పాటు చేశారు. అది కూడా రిలీజ్ రోజున ఇంటికి వచ్చి మరీ టికెట్లు అందజేస్తామని ప్రకటించారు.
ఈ గ్యాస్ ఏజెన్సీ గతంలో బాహుబలి-2 చిత్రం సమయంలోనూ ఇలాగే ఫ్రీ టికెట్లు ప్రకటించింది. తాజా ప్రకటన చేసిన కాసేపటికే మూడు సెకండ్ సిలిండర్లు బుక్ అయ్యాయని సదరు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి వెల్లడించారు. దుగ్గిరాల సరోజిని థియేటర్ లో వారు ఆర్ఆర్ఆర్ సినిమా చూసేందుకు టికెట్లను ఇంటికి వెళ్లి అందిస్తామని తెలిపారు.
ఇదిలా ఉండగా, ఆర్‌ఆర్‌ఆర్ మూవీ టికెట్ రేట్ల పెంపునకు ఏపీ ప్రభుత్వం గురువారం అనుమతి ఇచ్చింది. హై బడ్జెట్ సినిమా కావడంతో టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ సినిమా టికెట్‌పై మరో రూ. 75 పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి 10 రోజులు పెంపునకు అనుమతి ఇచ్చింది. దీనిపై రూ. 336 కోట్లతో సినిమా నిర్మించినట్లు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని పరిశీలించిన తర్వాత టికెట్ రేట్ల పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రెమ్యునరేషన్లు కాకుండా వంద కోట్లు బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని వెల్లడించారు. మొదటి 10 రోజులు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని తెలిపారు. ప్రజలకు భారం కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఈ నెల 14వ తేదీన ఇదే విషయమై రాజమౌళి, డీవీవీ దానయ్యలు ఏపీ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. వంద కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన సినిమాలకు రెండు వారాల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అయితే ఈ విషయమై సినిమా నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
త్రిబుల్ ఆర్ సినిమా నిర్మాణానికి రూ. 336 కోట్లు ఖర్చు అయిందని ప్రభుత్వానికి నిర్మాణ సంస్థ తెలిపింది. సినిమా టికెట్ల ధరల పెంపు ప్రజలపై భారం లేకుండా చూస్తామని కూడా ఏపీ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్నినాని ఇటీవలనే ప్రకటించారు. ఆర్ఆర్ ఆర్ సినిమా ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. దీంతో ఈ సినిమా టికెట్ పై రూ. 75 పెంచుకొనేందుకు ప్రభుత్వం అంగీకిరించింది ఈ మేరకు ఇవాళ జీవోను జారీ చేసింది.