తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో బోటు వెలికితీత పనులకు ప్రతికూల వాతావరణం ఆటంకం కలిగిస్తోంది. వాతావరణం అనుకూలించకపోవడంతో రెండో రోజు ఆపరేషన్ త్వరగా ముగిసింది. దీనిపై ధర్మాడి సత్యం మాట్లాడుతూ.. రెండో రోజు బోటు వెలికితీత పనులు ఫలించలేదన్నారు.

బోటు లంగర్‌ తగిలిందనుకొని లాగే ప్రయత్నం చేశామని కానీ ఇంతలోనే రోప్ తెగిపోయిందని సత్యం తెలిపారు. బోటు వెలికితీసే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బహుశా కొండరాళ్లకు లంగర్లు పడినట్లుగా సత్యం భావిస్తున్నారు. రేపు పకడ్బందీగా బోటు వెలికితీత ప్రయత్నాలు చేస్తామన్నారు.

గోదావరిలో గల్లంతైన బోటును బయటకు తీసేందుకు కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ సంస్థలకు ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ వర్క్ ఆర్డర్ విలువ దాదాపు రూ.22.7 లక్షలు ఉంటుందని సమాచారం.

మరోవైపు బోటు ప్రమాదంలో ఇప్పటి వరకు 36 మంది మృతదేహాలను వెలికితీయగా.. గల్లంతైన 14 మంది బోటుతో పాటుగా మునిగిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు