గుంటూరు జిల్లా తాడికొండ పోలీసు స్టేషన్‌లో ఓ రౌడీ షీటర్ చొక్కా లేకుండా వచ్చి.. మద్య మత్తులో హల్‌చల్ చేశాడు. పోలీసులనే బెదిరించాడు. వారిని దూషించాడు. ఒక హత్య, పలు దొంగతనాల కేసుల్లో రౌడీషీటర్ రియాజ్ నిందితుడిగా ఉండటంతో పోలీసు సిబ్బంది కూడా కొంత భయంతోనే మసులుకున్నట్టు తెలుస్తున్నది. పోలీసు అధికారిని దూషిస్తున్నా ఎస్సై వెంకటాద్రి స్పందించలేదు. చివరకు ఆ రౌడీ షీటర్‌ను పోలీసు స్టేషన్ వెలుపలికి పంపించగలిగారు.
అమరావతి: ఓ రౌడీ షీటర్(Rowdy Sheeter) తప్పతాగి.. పోలీసు స్టేషన్(Police Station)కు వచ్చి వీరంగం సృష్టించాడు. చొక్కా లేకుండానే వచ్చిన ఆ రౌడీ షీటర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. రక్షక భటులు అన్న గౌరవం కూడా లేకుండా బూతులు వదిలాడు. పోలీసు అధికారులపైనా అసభ్య పదజాలంతో దూషించాడు. పోలీసు స్టేషన్‌లోని ఎవరినీ లెక్క చేయలేదు. పోలీసుల విధులను ఆటంక పరిచాడు. పోలీసు స్టేషన్ సిబ్బంది మొత్తం వాడి చుట్టూ మూగి నిలబడిపోయారు. పోలీసులు వారిని అదుపులోకి తేకుండా కఠిన చర్యలేమీ తీసుకోకుండా నిలబడ్డారు. ఆ రౌడీ షీటర్ ఆగడాలను భరించలేక తండ్రికి ఫోన్ చేయాలని ఓ అధికారి మరొకరికి సూచించారు. ఈ ఘటన గుంటూరు(Guntur) జిల్లా తాడికొండ పోలీసు స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఆ రౌడీ షీటర్ పేరు రియాజ్.
స్టేషన్‌కు వెళ్లిన రౌడీ షీటర్‌ను కూర్చో అనగా.. కూర్చోలేదు. ఏం చెప్పినా వినలేదు. పైగా అధికారులపైకి మీది మీదికి వెళ్లాడు. వారిని ప్రశ్నలు వేస్తూ ఇబ్బంది పెట్టాడు. కానీ, ఎవరూ ధైర్యం చేసి అదుపులోకి తీసుకోలేదు. స్టేషన్ బయటకు తీసుకుపోవడానికి వెనుకాముందు ఆడారు. రౌడీ షీటర్ రియాజ్ గతంలో ఒక హత్య, మరికొన్ని దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. దీంతో ఆ రౌడీ షీటర్ అంతటి వీరంగం చేస్తున్న కొంత భయంతోనే పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోలేకపోయారని భావిస్తున్నారు. అసభ్యపదజాలంతో తిడుతున్నప్పటికీ ఆ ఎస్సై వెంకటాద్రి స్పందించకపోవడం గమనార్హం.
పోలీసులు తీరా ఫోన్ చేశాక ఓ వ్యక్తి రౌడీ షీటర్ రియాజ్‌ను తీసుకువెళ్లడానికి వచ్చాడు. పోలీసు స్టేషన్ నుంచి రౌడీ షీటర్‌ను బయటకు తీసుకెళ్లగలిగారు. కానీ, ఆ వచ్చిన వ్యక్తిపైనా రౌడీ షీటర్ ఆగ్రహించారు. వెనక్కి వెనక్కి నెట్టెస్తూ ఆ వ్యక్తిని భయపెట్టాడు. నెడుతూ ఆ వ్యక్తిని కూడా మళ్లీ పోలీసు స్టేషన్ ఆవరణలోకి తెచ్చాడు. వచ్చిన వ్యక్తిని బెదిరిస్తూ నువ్వు పోలీసు అధికారిపై కొట్టినట్టు ఆరోపించి రౌడీ షీటర్ తీయిస్తా అంటూ హెచ్చరించాడు. ఆ రౌడీ షీటర్‌ను ముందు బయటకు తీసుకెళ్లాలని పోలీసులు సదరు వ్యక్తికి సూచించారు. రియాజ్‌ను తీసుకెళ్లడం కష్టంగా ఉందని, పోలీసు కారులో దిగబెట్టాల్సిందిగా ఆ వ్యక్తి కోరాడు. అది కుదరదని, తమకు వేరే పనులు ఉన్నాయని చెప్పి.. ఆటోలో తీసుకెళ్లాల్సిందిగా ఆ పోలీసు అధికారి సూచించారు.
"
