Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు మహిళల ఉసురు తగిలింది: రోజా

20 మందికి పైగా విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకుంటే వారిని ఆదుకోవాల్సింది పోయి, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సింది పోయి వారిని మరింత మానసిక క్షోభకు గురి చేశారని ఆరోపించారు. ఆ తల్లిదండ్రుల ఉసురు తగిలి నారాయణ అనే వ్యక్తి అడ్రస్ లేకుండా పోయారని రోజా శాపనార్థాలు పెట్టారు. 

Roja wild comments against Chandrababu
Author
Amaravathi, First Published Jun 17, 2019, 4:24 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: గత ఐదేళ్లు తనతోపాటు మానసికక్షోభకు గురైన మహిళల ఉసురు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తగిలిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. కాలనాగులకు అండగా నిలిచి మహిళలపట్ల చిన్నచూపు చూసిన చంద్రబాబుకు మహిళలు తాట తీసి తోలు తీసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారంటూ ధ్వజమెత్తారు. 

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ నరసింహన్ ప్రసంగ తీర్మానంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన రోజా చంద్రబాబు పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో మహిళలు ప్రశాంతంగా ఉంటున్నారని ప్రతీ మహిళ తన అన్న సీఎం అయ్యాడంటూ సంబరపడుతున్నారంటూ కొనియాడారు. గత ప్రభుత్వం మహిళలకు నరకం చూపించిందని అందుకే ఆ పాలనను నరకాసుర పాలన అంటూ ఆమె అభివర్ణించారు. 

ఆలోచనలో నిజాయితీ, మాటల్లో ధైర్యం, చేతల్లో నిబద్ధత ఉండాలని సరోజనీ నాయుడు అన్నారని అవన్నీ కలిగిన ఏకైక వ్యక్తి వైయస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఆమె కొనియాడారు. ఐదేళ్ల నరకాసుర పాలనలో అరాచకాలు, వేధింపులు, అఘాయిత్యాలు, హత్యలతో మహిళలు ఆందోళన చెందారని అయితే వాటిని జగన్ నాయకత్వంలో దూరం చేశారని రోజా స్పష్టం చేశారు.

 గత ఐదేళ్ల కాలంలో పట్టపగలు కూడా మహిళ రోడ్డుపై కూడా తిరగలేని పరిస్థితి నెలకొందని ఆ దుస్థితిని జగన్ ప్రభుత్వం పారద్రోలిందని స్పష్టం చేశారు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఐదు నిమిషాల్లో మీ వద్దకు వచ్చి తాట తీస్తామని చెప్పిన ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఎవరైతే కాటువేశారో ఆ  కాలనాగులకు అండగా నిలిచారని ఆరోపించారు. 

చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా ఉన్న నారాయణ కళాశాలలో 20 మందికిపైగా అమ్మాయిలు ఆత్మహత్యలకు పాల్పడితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆడవాళ్ల ప్రాణాలు అంటే చంద్రబాబు నాయుడుకు చులకన అంటూ రోజా విమర్శించారు. 

20 మందికి పైగా విద్యార్థినిలు ఆత్మహత్యలు చేసుకుంటే వారిని ఆదుకోవాల్సింది పోయి, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సింది పోయి వారిని మరింత మానసిక క్షోభకు గురి చేశారని ఆరోపించారు. ఆ తల్లిదండ్రుల ఉసురు తగిలి నారాయణ అనే వ్యక్తి అడ్రస్ లేకుండా పోయారని రోజా శాపనార్థాలు పెట్టారు. 

తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అరాచకాలపై మహిళలంతా కలిసి తాట తీసి తోలు తీసి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చదవువుల తల్లి రిషితేశ్వరిని ర్యాగింగ్ పేరుతో వేధిస్తే ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే నిందితులను అరెస్ట్ చేయాల్సింది పోయి ఎమ్మెల్యేకు బంధువు అని చెప్పి కేసును నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. 

మరోవైపు విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసును సైతం మూసివేయించి మహిళలకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ విరుచుకుపడ్డారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ లో టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఉన్నారని తెలుసుకున్న చంద్రబాబు ఆ కేసును మూసివేయించి ఆడవాళ్లకు తీరని అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు కాదా అని నిలదీశారు. 

ఆ కాల్ మనీ సెక్స్ రాకెట్ కోసం అసెంబ్లీలో పోరాటం చేస్తే తనను అకారణంగా ఏడాదిపాటు సస్పెండ్ చేశారని ఆరోపించారు. తనను ఏడాదిపాటు సస్పెండ్ చేయడం వల్ల మానసిక క్షోభకు గురయ్యామని తెలిపారు. 

తనతోపాటు, మానసిక క్షోభకు గురైన మహిళల ఉసురు చంద్రబాబుకు తగిలిందని ఆ ఉసురే వారు 23 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోవడం అన్నారు. అన్నా అంటూ పిలిపించుకుని మహిళల నోట్లో సున్నం  కొట్టిన వ్యక్తి మాజీ సీఎం చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. 

మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని చీటింగ్ చీఫ్ మినిస్టర్ గా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారంటూ రోజా విరుచుకుపడ్డారు. మరోవైపు వైయస్ జగన్ మహిళల పక్షపాతి అని రోజా చెప్పుకొచ్చారు. 

నలుగురు మహిళలకు ఎంపీలుగా అవకాశం ఇవ్వడంతోపాటు రాష్ట్రంలో 13 మంది మహిళలకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని అలాగే వారిలో ఒకర్ని ఉపముఖ్యమంత్రి, మరోకర్ని హోంమంత్రిగా చేసి మహిళలకు కొండంత అండగా సీఎం వైయస్ జగన్ నిలిచారంటూ రోజా స్పష్టం చేశారు. 


ఈ వార్తలు కూడా చదవండి

ఏపీకి టార్చ్ బేరర్ వైయస్ జగన్: రోజా

Follow Us:
Download App:
  • android
  • ios